నెల్లూరు కోర్టులో ఆధారాల దొంగతనం కేసు.. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు

దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా కోర్టులో దొంగలు పడటం.. అదీ ఓ కీలకమైన కేసులో ఆధారాలుగా ఉన్న పత్రాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను దొంగిలించడంతో నెల్లూరు పోలీసులు ఉలిక్కిపడ్డారు.

Updated : 16 Apr 2022 07:46 IST

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా కోర్టులో దొంగలు పడటం.. అదీ ఓ కీలకమైన కేసులో ఆధారాలుగా ఉన్న పత్రాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను దొంగిలించడంతో నెల్లూరు పోలీసులు ఉలిక్కిపడ్డారు. రాజకీయపరమైన ఆరోపణలు రావడంతో అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ సీహెచ్‌ విజయరావు నేరుగా రంగంలోకి దిగి విచారిస్తున్నారు. దొంగతనం జరిగిన కోర్టు ప్రాంగణాన్ని ఎస్పీ బృందం శుక్రవారం పరిశీలించింది. కీలక పత్రాలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ నుంచి దొంగిలించారు? ఎలా చేశారనే వివరాలు తెలుసుకున్నారు. కేసు చిన్నబజారు పోలీసుస్టేషన్‌ పరిధిలోనిది కావడంతో ఇటీవల బదిలీపై వెళ్లిన ఇన్‌స్పెక్టరు మధుబాబును రంగంలోకి దించారు. బుధవారం రాత్రి దొంగతనం జరిగినట్లు కోర్టు బెంచ్‌ క్లర్క్‌ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన చిన్నబజారు పోలీసులు కూపీ లాగుతున్నారు. కోర్టు ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో కేసును ఛేదించడం కష్టమైనా.. కోర్టు బయట రహదారులపై ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజిని పరిశీలించారు. కోర్టుకు వెళ్లే అన్నివైపులా రహదారులపై ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. బుధవారం అర్ధరాత్రి రెండు, మూడు గంటల మధ్యలో దొంగతనం చేసి ఉంటారని భావిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరూ పాత నేరస్థులే. రెండు నెలల కిందట రాయాజీవీధిలో జరిగిన ఓ చోరీ కేసులో నిందితులు. ఓ వృద్ధురాలిని కట్టేసి బంగారు నగలు దొంగిలించారు. అప్పట్లో వీరిపై దోపిడీ కేసు కాకుండా, నామమాత్రపు కేసు నమోదు చేశారు. జైలు నుంచి విడుదల చేసిన తర్వాత కోర్టులో దొంగతనం చేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ స్నేహితులు కావడం గమనార్హం. బండిపై ఉల్లిపాయలు విక్రయిస్తుంటారు. త్వరలోనే పోలీసులు ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు వెల్లడించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని