Andhra News: ఇనుము కోసం వెళ్లి.. కోర్టులో దొంగతనం

నిర్మాణంలో ఉన్న కొత్త కోర్టు భవనం వద్ద ఇనుము దొంగతనానికి వెళ్లి అది కుదరకపోవడంతో ప్రస్తుత కోర్టులో చోరీ చేశారని నెల్లూరు ఎస్పీ సీహెచ్‌ విజయరావు తెలిపారు. ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెల్లూరు కోర్టులో దొంగతనం

Published : 18 Apr 2022 05:44 IST

నిందితులిద్దరూ నేర చరిత్ర ఉన్నవారే

ఎస్పీ సీహెచ్‌ విజయరావు

ఈనాడు డిజిటల్‌- నెల్లూరు, న్యూస్‌టుడే- నేర విభాగం: నిర్మాణంలో ఉన్న కొత్త కోర్టు భవనం వద్ద ఇనుము దొంగతనానికి వెళ్లి అది కుదరకపోవడంతో ప్రస్తుత కోర్టులో చోరీ చేశారని నెల్లూరు ఎస్పీ సీహెచ్‌ విజయరావు తెలిపారు. ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెల్లూరు కోర్టులో దొంగతనం కేసులో నిందితులను పోలీసులు అరెస్టుచేశారు. కేసు వివరాలను విలేకర్లకు ఆదివారం ఎస్పీ వెల్లడించారు. ‘కుటుంబానికి దూరంగా ఉంటూ మద్యానికి బానిసలైన హయాత్‌, రసూల్‌ అనే వ్యక్తులు నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండు సమీపంలో పైవంతెన కింద నివసిస్తున్నారు. డబ్బుకోసం దొంగతనాలు చేస్తున్నారు. హయాత్‌ 15 కేసుల్లో నిందితుడు. తరచూ కోర్టులో విచారణకు హాజరయ్యేవాడు. ఆ క్రమంలో కోర్టు ప్రాంగణంలో కడుతున్న కొత్త భవనంలో ఇనుము చోరీ చేయాలనుకున్నాడు. ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రి పాత జైలు మీదుగా కోర్టు ప్రాంగణంలోకి హయాత్‌, రసూల్‌ ప్రవేశించారు. ఇనుము ఉన్నచోటుకు వెళ్తుండగా కుక్కలు మొరగడంతో భయపడి అక్కడి నుంచి కోర్టు మొదటి అంతస్తులోకి చేరుకున్నారు. కోర్టులో విలువైన వస్తువులు ఉంటాయని భావించి.. తాళాన్ని ఇనుప రాడ్డుతో పగలగొట్టారు. గదిలో ఉన్న బీరువా తెరవగా అందులో సంచి కనిపించింది. విలువైన వస్తువులు ఉంటాయని భావించి అపహరించారు. తర్వాత ఎలక్ట్రానిక్‌ వస్తువులు తీసుకుని.. మిగిలిన పత్రాలను పక్కనే ఉన్న కాలువలో పడేశారు’ అని తెలిపారు. చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించారన్నారు. వారినుంచి ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి అపోహలకు తావులేదని, రాజకీయ ప్రమేయం లేదని విచారణలో తేలిందన్నారు.


ఫోన్ల దొంగతనానికి కోర్టుకు వెళ్తారా?

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ఈనాడు, అమరావతి: నెల్లూరు కోర్టులో సెల్‌ఫోన్ల కోసం చోరీ జరిగినట్లు ఎస్పీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ‘14 కేసులతో సంబంధం ఉన్న దొంగలు కోర్టుల్లో దొంగతనానికి సాహసిస్తారా? సెల్‌ఫోన్ల కోసం వచ్చిన దొంగ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్న కేసులోని ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఇతర సాక్ష్యాలను మాత్రమే ఎందుకు తీసుకెళ్తాడు? జిల్లా ఎస్పీ వ్యాఖ్యలు జరిగిన ఘటనను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయ’న్నారు.


వాళ్లు నిజమైన దొంగలేనా?

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్న కేసులోని కీలక పత్రాలు, ఆధారాల చోరీ ఘటనలో పోలీసులు ఆదివారం ఇద్దరిని అరెస్టుచేశారు. దొరికినది నిజమైన దొంగలేనా? పోలీసులపై వస్తున్న ఒత్తిడి, రాజకీయ విమర్శలను ఎదుర్కొనేందుకు ఎవరో ఒకరిని అరెస్టు చేసి.. వారే దొంగలన్నట్లు చూపిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణాలివే.

* నెల్లూరులోని నాలుగో అదనపు మేజిస్ట్రేట్‌ కోర్టు భవనం జీ+1గా ఉంటుంది. ఇందులో కింద 2 కోర్టులు.. పైన ఒక గది ఉంటాయి. దొంగతనం మొదటి అంతస్తులోనే.. అదీ మంత్రి కాకాణి కేసు పత్రాలు, ఆధారాలు ఉన్న బీరువాలోనే జరిగిందని చెబుతున్నారు. ఆ బీరువాలోనే ఎందుకు చేశారనే ప్రశ్న తలెత్తుతోంది.

* ఇసుము చోరీకే వచ్చారని పోలీసులు చెబుతున్నారు. అలాగైతే కోర్టులోకి తాళం పగలగొట్టి ఎందుకు వెళ్లారు? యాదృచ్ఛికంగా వెళ్లినా.. మిగతా వస్తువులను తాకకుండా ఒక్క బీరువాలోనే దొంగతనం చేయడం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

* వాస్తవానికి గదిలో దొంగతనం చేయాలనుకుంటే.. బీరువా వరకు వెళ్లక్కర్లేదు. తలుపు తీయగానే టేబుళ్లపై కంప్యూటర్లు, పలు కేసులకు సంబంధించిన విలువైన పరికరాలు ఉన్నాయి. వాటిని తాకకపోవడం ఏంటి?

* సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నా.. వారు బహిర్గతం చేసిన చిత్రాల్లో నిందితులను గుర్తించేలా స్పష్టమైన ఆనవాళ్లు కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి.

* ఎవరో సమాచారం ఇచ్చినట్లు బీరువాలో కాకాణి కేసుకు సంబంధించిన సంచినే ఎందుకు తీసుకెళ్లారు? దీనికి కోర్టులోనే ఎవరైనా సహకరించారా? అనే సందేహాలు న్యాయవాద వర్గాల్లో వినిపిస్తున్నాయి.

* దొంగతనం జరిగిన ప్రాంతంలో సాంకేతికపరమైన ఆధారాలు సేకరించినట్లు పోలీసులు చెప్పకపోవడంపై న్యాయవాద వర్గాలు చర్చించుకుంటున్నాయి.

* దొంగలకు ఎవరో ముందే చెప్పినట్లు.. కాకాణి గోవర్ధన్‌రెడ్డి కేసు పత్రాలున్న గదికి  వెళ్లి.. ఆ దస్త్రాలే ఎలా తీశారనేది అసలు మిస్టరీగా ఉంది. దీనిపై స్పష్టమైన వివరాలు వెల్లడిస్తే గానీ.. గుట్టు వీడదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని