Andhra News: మంచినీరు అనుకుని యాసిడ్‌ తాగిన యువకుడు

వ్యాపారి నిర్లక్ష్యంతో మంచినీరు అనుకుని యాసిడ్‌ తాగిన ఓ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విజయవాడ నగరంలోని ఎనికేపాడులో చోటుచేసుకున్న ఈ

Updated : 17 Aug 2022 15:44 IST

వ్యాపారి నిర్లక్ష్యంతో ఆసుపత్రిపాలు

ఎనికేపాడు(రామవరప్పాడు), న్యూస్‌టుడే: వ్యాపారి నిర్లక్ష్యంతో మంచినీరు అనుకుని యాసిడ్‌ తాగిన ఓ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విజయవాడ నగరంలోని ఎనికేపాడులో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా నాగాయలంకకు చెందిన కోసూరు చైతన్య.. విజయవాడ లయోలా కళాశాలలో ఏవియేషన్‌ విభాగంలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి కేసరపల్లిలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఈ నెల 14న చైతన్య.. ఎనికేపాడులో ఉన్న తన స్నేహితుల గదికి వచ్చాడు. సమీపంలో ఉన్న కూల్‌డ్రింక్‌ షాపునకు వెళ్లి మంచినీరు సీసా అడుగగా.. ఫ్రిజ్‌లో ఉంది తీసుకోమని వ్యాపారి తెలిపారు. దీంతో చైతన్య.. ఫ్రిజ్‌లో మంచినీరు సీసా పక్కనే ఉన్న యాసిడ్‌ సీసాను తీసుకుని తాగాడు. మంచినీటి సీసా వలే యాసిడ్‌ సీసా ఉండటంతో గమనించలేదు. వెంటనే వాంతులు చేసుకోవడంతో స్నేహితులు అతనిని సమీపంలో ఉన్న క్లినిక్‌కి తీసుకెళ్లారు. అక్కడ యాసిడ్‌ తాగినట్లు ధ్రువీకరించి మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో విజయవాడ సూర్యారావుపేటలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పినప్పటికీ అవయవాలపై ప్రభావం చూపింది. ప్రస్తుతం చైతన్య ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో లయోలా కళాశాల యాజమాన్యం చికిత్సకు అవసరమైన ఖర్చులను భరించడానికి ముందుకొచ్చింది. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రావి సురేష్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని