Andhra News: ‘తలుపుల’ కాలేజీ.. తలపులు వేరేవి!

విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అధ్యాపకులే వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఘటన శ్రీసత్యసాయి జిల్లా తలుపుల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చోటుచేసుకుంది. ఇద్దరు అధ్యాపకులు తమను వేధిస్తున్నారని పలువురు విద్యార్థినులు

Updated : 20 Apr 2022 10:29 IST

విద్యార్థినులతో అధ్యాపకుల వెకిలిచేష్టలు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, తలుపుల: విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అధ్యాపకులే వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఘటన శ్రీసత్యసాయి జిల్లా తలుపుల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చోటుచేసుకుంది. ఇద్దరు అధ్యాపకులు తమను వేధిస్తున్నారని పలువురు విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒళ్లో కూర్చోవాలంటూ ఇబ్బంది పెడుతున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. గోవాలో అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసుకోవాలంటున్నారని వాపోయారు. ప్రతిరాత్రి గుడ్‌నైట్‌ చెప్పి నిద్రపోవాలంటూ ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. తమతోపాటు కదిరి పట్టణానికి వస్తే కోరినవి తినిపిస్తామని చెబుతున్నారని గోడు వెళ్లబోసుకుంటున్నారు. విద్యార్థులనే కాదు, అధ్యాపకురాలితోనూ వారు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఒక బాధితురాలు ‘ఈనాడు-ఈటీవీ’తో తన గోడు చెబుతూ విలపించారు.

ఈ కళాశాలలో రెగ్యులర్‌ అధ్యాపకులు ఇద్దరే ఉన్నారు. మిగిలిన వారంతా ఒప్పంద ఉద్యోగులు. వారు ఓ జట్టుగా ఏర్పడి మహిళా సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, సినిమా డైలాగులతో ద్వంద్వర్థాలు వచ్చేలా మాట్లాడుతున్నారని సిబ్బంది వాపోయారు. రికార్డు అసిస్టెంట్‌ సైతం వీరితో జతకట్టారని ఆరోపించారు. కళాశాలలో తమను ఇబ్బంది పెడుతున్న అధ్యాపకులు, రికార్డు అసిస్టెంట్‌పై డీవీఈవో దృష్టికి తీసుకెళ్లినట్లు పలువురు తెలిపారు. ఆయన ఇటీవల విచారణ చేసినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీనిపై కళాశాల ప్రిన్సిపల్‌ నిలోఫర్‌ను వివరణ కోరగా వేధింపుల విషయం ఇటీవలే తన దృష్టికి వచ్చిందని.. ఉన్నతాధికారులకు తెలియజేస్తానని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని