Andhra News: భర్త మృతితో మనోవేదన.. గంటల్లోనే భార్య బలవన్మరణం

మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.. సంతాన భాగ్యం లేకపోయినా ఒకరికొకరు తోడుగా ఇన్నేళ్లూ జీవించారు.. వృద్ధాప్యం, ఆర్థిక ఇబ్బందులతోపాటు అనారోగ్యం బారినపడి భర్త మృతి చెందితే.. దాన్ని

Updated : 21 Apr 2022 07:39 IST

సంతానం లేక, ఆర్థిక ఇబ్బందులతోనూ సతమతం
పక్కపక్కనే అంత్యక్రియలు నిర్వహించిన స్వచ్ఛంద సంస్థ

గుంటూరు (నెహ్రూనగర్‌), న్యూస్‌టుడే: మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.. సంతాన భాగ్యం లేకపోయినా ఒకరికొకరు తోడుగా ఇన్నేళ్లూ జీవించారు.. వృద్ధాప్యం, ఆర్థిక ఇబ్బందులతోపాటు అనారోగ్యం బారినపడి భర్త మృతి చెందితే.. దాన్ని జీర్ణించుకోలేని భార్య కూడా కొన్ని గంటల వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకున్నారు. అంత్యక్రియలకూ డబ్బుల్లేని ఆ వృద్ధ దంపతులకు ఒకరి తర్వాత మరొకరికి పక్కపక్కనే చితిపేర్చి అంతిమ సంస్కారాలు నిర్వహించారు ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు. ఈ విషాద ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కన్నావారితోటకు చెందిన దంపతులు మణుగూరి వెంకట రమణారావు (68), సువర్ణ రంగలక్ష్మి (65)లకు పిల్లలు లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న రమణారావును భార్య ఈ నెల 19న గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన అర్ధరాత్రి మృతి చెందారు. భర్త అంత్యక్రియలకూ చేతిలో చిల్లిగవ్వ లేదంటూ రంగలక్ష్మి ఆసుపత్రిలోనే ఆత్మహత్యకు యత్నించారు. ఆసుపత్రి సిబ్బంది వారించి, రుద్రా ఛారిటబుల్‌ ట్రస్టు వ్యవస్థాపకులు సుభానీకి సమాచారం ఇచ్చారు. ట్రస్టు సభ్యులు ఆమెను ఓదార్చారు.

తామే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ధైర్యం చెప్పారు. భర్త చనిపోయిన తాను అద్దె ఇంట్లోకి వెళ్లలేనంటూ రంగలక్ష్మి బాధపడ్డారు. పిల్లల్లేరు.. భర్త కూడా మరణించారు.. ఇక తానెలా బతకాలంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. తాము అనాథాశ్రమంలో చేర్పించి బాగోగులు చూసుకుంటామని ట్రస్టు సభ్యులు నచ్చజెప్పారు. రమణారావు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు. తెల్లారాక ఆశ్రమానికి తీసుకెళతామంటూ వేకువజామున 3 గంటలకు ట్రస్టు సభ్యులు రంగలక్ష్మిని ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చారు. తీవ్ర మనోవేదనకు గురైన ఆమె ఇంటి లోపలకు వెళ్లకుండా తన చీరతో గేటు బయట ఉన్న ఇనుపరాడ్డుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ట్రస్టు సభ్యులు ఆమె మృతదేహానికి శవపరీక్ష చేయించి, భర్త చితి పక్కనే అంత్యక్రియలు నిర్వహించారు. పిల్లలు లేకపోవడం, భర్త మృతి చెందాడనే మనోవేదనతో బతుకు భారమవుతుందని భావించి తన సోదరి ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని రంగలక్ష్మి సోదరుడు శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారని నగరంపాలెం సీఐ హైమారావు తెలిపారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని