విద్యుత్తు వాహనం బ్యాటరీ పేలుడు

ఇంట్లో ఛార్జింగ్‌ పెట్టిన విద్యుత్తు వాహనం బ్యాటరీ పేలిపోవడంతో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. నిజామాబాద్‌లోని సుభాష్‌నగర్‌లో బుధవారం వేకువజామున ఈ దుర్ఘటన జరిగింది. మూడో ఠాణా ఎస్సై సాయినాథ్‌ కథనం ప్రకారం.. బల్ల ప్రకాష్‌ తన భార్య కృష్ణవేణి (40), కుమారుడు కల్యాణ్‌ (19) తల్లిదండ్రులు కమలమ్మ (75), రామస్వామి (80)తో కలిసి సుభాష్‌నగర్‌లో ఓ ఇంటి మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్నారు. మంగళవారం రాత్రి....

Published : 21 Apr 2022 05:20 IST

ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు
నిజామాబాద్‌ జిల్లాలో ఘటన

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: ఇంట్లో ఛార్జింగ్‌ పెట్టిన విద్యుత్తు వాహనం బ్యాటరీ పేలిపోవడంతో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. నిజామాబాద్‌లోని సుభాష్‌నగర్‌లో బుధవారం వేకువజామున ఈ దుర్ఘటన జరిగింది. మూడో ఠాణా ఎస్సై సాయినాథ్‌ కథనం ప్రకారం.. బల్ల ప్రకాష్‌ తన భార్య కృష్ణవేణి (40), కుమారుడు కల్యాణ్‌ (19) తల్లిదండ్రులు కమలమ్మ (75), రామస్వామి (80)తో కలిసి సుభాష్‌నగర్‌లో ఓ ఇంటి మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్నారు. మంగళవారం రాత్రి 12.30 గంటలకు బయట నుంచి ఇంటికి వచ్చిన కల్యాణ్‌ తన ఎలక్ట్రిక్‌ వాహనం బ్యాటరీని బయటకు తీసి, తమ ఇంట్లో ఛార్జింగ్‌ పెట్టాడు. అనంతరం ఇంట్లో వారంతా నిద్రపోయారు. బుధవారం వేకువజామున నాలుగు గంటల ప్రాంతంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయి. అక్కడే హాలులో నిద్రిస్తున్న రామస్వామి, కమలమ్మ, కల్యాణ్‌కు మంటలు అంటుకొన్నాయి. వీరి అరుపులతో పడకగదిలో నిద్రిస్తున్న ప్రకాష్‌, అతని భార్య కృష్ణవేణి బయటికొచ్చారు. భార్యాభర్తలిద్దరూ కలిసి నీరు, దుప్పట్లతో మంటలను అదుపు చేశారు. ముగ్గురినీ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రామస్వామికి 70 శాతం పైగా గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా దారిలోనే ఆయన మృతి చెందారు. కమలమ్మ, కల్యాణ్‌ నిజామాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని రక్షించే క్రమంలో కృష్ణవేణికి సైతం గాయాలవడంతో ఆమెను కూడా ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు.

ఛార్జింగ్‌ సమయం అయిదు గంటలు.. ఆ లోగానే పేలుడు

ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించి ఒక్కో కంపెనీ బ్యాటరీకి ఒక్కోలా నిబంధనలున్నాయి. ఈ ప్రమాదంలో కంపెనీ బ్యాటరీ పూర్తిగా నిండటానికి అయిదు గంటలు ఛార్జింగ్‌ పెట్టాల్సి ఉంటుందని పోలీసుల విచారణలో తేలింది. కానీ నాలుగు గంటలు కూడా పూర్తిగా కాకముందే బ్యాటరీ పేలడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర సాంకేతిక కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని