Telangana News: కలెక్టర్‌ డీపీ పెట్టి డబ్బుల ఎర.. మోసపోయిన వైద్యుడు

కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అక్కడ కొందరికి మొబైల్‌ నంబరు 72348 22110 నుంచి వాట్సప్‌ మెసేజ్‌లు వచ్చాయి.

Published : 22 Apr 2022 07:59 IST

పాలనాప్రాంగణం(ఆదిలాబాద్‌), న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అక్కడ కొందరికి మొబైల్‌ నంబరు 72348 22110 నుంచి వాట్సప్‌ మెసేజ్‌లు వచ్చాయి. ‘అత్యవసర సమావేశంలో ఉన్నా. ఫోన్‌ చేయలేకపోతున్నా. డబ్బులు అవసరం. వెంటనే పంపగలరు’ అన్నది వాటి సారాంశం. డీపీ(డిస్‌ప్లే పిక్చర్‌) చూస్తే కలెక్టర్‌ ఫొటో ఉంది. ఆశ్చర్యపోయిన వారు వెంటనే ఎదురుగానే ఉన్న సిక్తా పట్నాయక్‌ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే ఆమె తన పేషీ ద్వారా విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఇదే క్రమంలో ఒక ప్రభుత్వ వైద్యుడు మోసపోయారు. కలెక్టర్‌ డీపీ ఉన్న మొబైల్‌ నంబరు నుంచి డబ్బులు పంపాలని వాట్సప్‌ మెసేజ్‌లు రాగానే ఆదిలాబాద్‌కు చెందిన ఆయన స్పందించారు. తన బావమరిదికి డబ్బులు పంపితే ఆయన రూ.10 వేల విలువైన పది అమెజాన్‌ కూపన్లు కొని అవతలివ్యక్తికి పంపారు. ఆ తర్వాత మరో రూ.1.5 లక్షలు కావాలని అడగడంతో అనుమానం వచ్చి ఆ వైద్యుడు కలెక్టర్‌ పేషీని సంప్రదిస్తే విషయం అర్థమైంది. వెంటనే ఆ కూపన్లను క్యాన్సిల్‌ చేస్తూ వెళ్లగా అప్పటికే ఆ వ్యక్తి మూడు కూపన్లను వాడేశాడు. తక్కిన ఏడు కూపన్లకు సంబంధించిన రూ.70 వేలను వెనక్కు రాబట్టుకోగలిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని