Telangana News: ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి.. కత్తి, గొడ్డలితో నరికి..

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో గురువారం పట్టపగలు మున్సిపల్‌ కౌన్సిలర్‌ను దారుణంగా హత్య చేశారు. ఇద్దరు వ్యక్తులు ట్రాక్టరుపై, కారులో ఎదురుగా వచ్చి ఆయన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు.

Published : 22 Apr 2022 05:55 IST

మున్సిపల్‌ కౌన్సిలర్‌ రవి దారుణ హత్య
మహబూబాబాద్‌లో పట్టపగలు నడిరోడ్డుపై ఘటన
ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు సంబంధం ఉందని హతుడి తల్లి ఆరోపణ

ఈనాడు డిజిటల్‌, న్యూస్‌టుడే, మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో గురువారం పట్టపగలు మున్సిపల్‌ కౌన్సిలర్‌ను దారుణంగా హత్య చేశారు. ఇద్దరు వ్యక్తులు ట్రాక్టరుపై, కారులో ఎదురుగా వచ్చి ఆయన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. కిందపడగానే రోడ్డు పక్కకు తీసుకెళ్లారు. కారులో ఉన్న వ్యక్తి తన వెంట తెచ్చుకున్న కత్తితో.. ట్రాక్టర్‌పై ఉన్న వ్యక్తి గొడ్డలితో కౌన్సిలర్‌ మెడ, తలపై నరికారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ పురపాలక సంఘం 8వ వార్డు కౌన్సిలర్‌ బాబునాయక్‌ తండాకు చెందిన రవినాయక్‌ (35) ఉదయం పట్టణంలో జరిగిన ఓ శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ కవితతో కలిసి పాల్గొన్నారు. అనంతరం పత్తిపాక ప్రాంతంలో తాను నిర్మిస్తున్న ఇంటి వద్దకు వెళ్తుండగా మహబూబాబాద్‌-రజాలుపేట ప్రధాన రహదారిపై ఈ దాడి జరిగింది. సగం వరకు మెడ తెగడంతో రవి తీవ్ర రక్తస్రావంతో అక్కడే కుప్పకూలారు. నిందితులు ట్రాక్టరును అక్కడే వదిలేసి కారులో పారిపోయారు. కొన ఊపిరితో ఉన్న రవిని బంధువులు జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి తర్వాత ఆయన తెరాసలో చేరారు.

అదుపులో నిందితులు

రవిని హత్య చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ గురువారం సాయంత్రం తెలిపారు. పట్టణంలోని మంగళికాలనీకి చెందిన భూక్య విజయ్‌, బాబునాయక్‌ తండాకు చెందిన భూక్య అరుణ్‌ కలిసి ఈ హత్య చేశారన్నారు. వారిని అదుపులోకి తీసుకుని హత్యకు ఉపయోగించిన ఆయుధాలను, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హత్యలో రాజకీయ ప్రమేయం ఉన్నట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. వ్యాపార విభేదాలే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. రవిపై మహబూబాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో రౌడీ షీట్‌ ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. అలాగే నిందితులు తమ ప్రాంతాల్లో బెల్లం, కలప వ్యాపారం చేస్తుంటారని సమాచారం.

హత్యతో మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు సంబంధం ఉందని రవి తల్లి లక్ష్మి.. మంత్రి సత్యవతి రాథోడ్‌కు తెలిపారు. మృతదేహానికి నివాళులర్పించేందుకు మంత్రి మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి రాగా ఆమె మాట్లాడారు. ‘కొన్ని విషయాల్లో ఎమ్మెల్యే నా కుమారుడిపై కేసులు పెట్టించారు’ అని రోదించారు. నిందితులు ఎవరైనా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. అంతకుముందు ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ఆసుపత్రికి చేరుకోగానే ‘మీవల్లనే రవి హత్యకు గురయ్యాడ’ని ఆరోపిస్తూ లక్ష్మి రోదించారు. రవి కుటుంబాన్ని ఆదుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని