Cyber Crime: ఎంపీ కోటాలో ఎంబీబీఎస్‌ సీట్లంటూ బురిడీ

నీట్‌లో అర్హత సాధించి ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందలేని వారిని గుర్తించి..పార్లమెంటు సభ్యుల కోటాలో ఎంబీబీఎస్‌ సీట్లు ఇప్పిస్తామంటూ సైబర్‌ నేరస్థులు మోసాలకు పాల్పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే లక్ష్యంగా ఫోన్లుచేసి..

Updated : 24 Apr 2022 06:45 IST

కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో ప్రవేశాల పేరిట మాయ

నీట్‌ రాసిన వారికి ఫోన్లు, రూ.లక్షల్లో వసూళ్లు

వెలుగులోకి సైబర్‌ నేరస్థుల కొత్త మోసం

ఈనాడు, హైదరాబాద్‌: నీట్‌లో అర్హత సాధించి ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందలేని వారిని గుర్తించి..పార్లమెంటు సభ్యుల కోటాలో ఎంబీబీఎస్‌ సీట్లు ఇప్పిస్తామంటూ సైబర్‌ నేరస్థులు మోసాలకు పాల్పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే లక్ష్యంగా ఫోన్లుచేసి..బెంగళూరు, రాయచూరు, దావణగెరె, కలబురిగి, మైసూరులోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో చేర్పిస్తామంటూ నమ్మిస్తున్నారు. బయానాగా రూ.లక్షలు తీసుకుని, తర్వాత ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారు. ‘హైదరాబాద్‌లో ఉంటున్న ముగ్గురు విద్యార్థినుల తల్లిదండ్రులకు ఫోన్లుచేసి రెండు రోజుల్లోనే రూ.20.50 లక్షలు కాజేశారని, తల్లిదండ్రులు ఇలాంటివి నమ్మి మోసపోవద్దని’ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఎలా మోసగిస్తారంటే..

నీట్‌లో ర్యాంకు వచ్చి ఎంబీబీఎస్‌లో సీటురాని వారి జాబితాను సేకరిస్తున్న సైబర్‌ నేరస్థులు, వెబ్‌సైట్‌లోని వారి నంబర్లకు నేరుగా ఫోన్‌ చేస్తున్నారు. రూ.50 లక్షలు ఇస్తే   ఎంపీ కోటాలో రిజర్వ్‌ చేసిన ఎంబీబీఎస్‌   సీటు ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు స్పందిస్తే కళాశాలల జాబితా పంపి, ఒకదాన్ని ఎంచుకోమంటారు. ఆ ప్రక్రియ ముగియగానే ఆయా ప్రాంతాల్లోని తమ ప్రతినిధులను సంప్రదించాలని సూచించి చిరునామా, ఫోన్‌ నంబరు ఇస్తారు.

* అక్కడికి వెళ్లాక సదరు వ్యక్తి బాధితులను నేరుగా కళాశాలకు తీసుకెళ్తారు. సీటు గురించి మాట్లాడి వస్తామని సూచించి ప్రిన్సిపాల్‌ లేదా డీన్‌ల గదుల్లోకి వెళ్తారు. రెండు, మూడు నిముషాల్లో తిరిగొస్తారు. సీటు ఖరారయిందని, బయానాగా రూ.10 లక్షలు ఫలానా బ్యాంకు ఖాతాకు బదిలీ చేయమని సూచిస్తారు.

* నగదు బదిలీ పూర్తయ్యాక..వారం రోజుల్లో కళాశాల నుంచి అధికారికంగా లేఖ వస్తుందని, దాన్ని తీసుకొచ్చి మిగిలిన ఫీజు చెల్లించాలని సూచించి వెళ్లిపోతారు. వారం తర్వాత వాట్సాప్‌లో కళాశాల నకిలీ అధికారిక ముద్రతో లేఖనూ పంపుతారు. ‘‘లేఖ చూడగానే సీటు ఖరారైందని బాధితులు సంతోషిస్తున్నారు. ఆ లేఖతో కళాశాలకు వెళ్తే ‘దాన్ని తాము పంపలేదని, అది నకిలీదనే’ సమాధానం అక్కడి సిబ్బంది నుంచి వస్తుండటంతో లబోదిబోమంటున్నారు. డబ్బులిచ్చిన వ్యక్తికి ఫోన్‌చేస్తే స్విచ్ఛాఫ్‌ అని వస్తుండటంతో తాము మోసపోయినట్టు నిర్ధారణకు వస్తున్నారని’’ ఓ పోలీస్‌ అధికారి తెలిపారు.

ఇతర రాష్ట్రాల కళాశాలల పేర్లు చెబుతూ..

తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు పరిసర ప్రాంతాల్లోని కళాశాలల పేర్లు చెబితే, ఆయా యాజమాన్యాలను సంప్రదిస్తారని ముందే ఊహించిన సైబర్‌ నేరస్థులు ఇతర రాష్ట్రాల్లోని కళాశాలల పేర్లు చెబుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ‘మోసగాళ్లు ఎక్కువగా కర్ణాటకలోని రాయచూరు, మైసూరు, దావణగెరె, కలబురిగి, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల్లోని వైద్య కళాశాలల పేర్లు ప్రతిపాదిస్తున్నారు. వెళ్లిన వారికి ఆతిథ్యం ఇచ్చి మరీ పంపుతున్నారని’ ఓ పోలీస్‌ అధికారి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు