Road Accident: ఆస్ట్రేలియా నుంచి రెక్కలు కట్టుకుని వచ్చి.. రెప్పపాటులో మృత్యుఒడికి

వారిరువురూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉన్నత చదువుల తర్వాత ఉద్యోగం నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఏడాదికి ఒకసారైనా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులను చూసి వారితో కొన్నిరోజులు సంతోషంగా

Updated : 28 Apr 2022 06:44 IST

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం

చివ్వెంల, రెడ్డిగూడెం, న్యూస్‌టుడే: వారిరువురూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉన్నత చదువుల తర్వాత ఉద్యోగం నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఏడాదికి ఒకసారైనా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులను చూసి వారితో కొన్నిరోజులు సంతోషంగా గడిపి వెళ్తుంటారు. రెండు మూడేళ్లుగా కరోనా వల్ల స్వదేశానికి రాలేకపోయారు. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గడంతో కన్నవారిని చూసేందుకు ఇంటికి వస్తుండగా.. మార్గమధ్యలో మృత్యువు వేటాడింది. రోడ్డు ప్రమాదంలో ఆ దంపతులను కాటేసి వారి బిడ్డలను అనాథలను చేసింది. ఈ దుర్ఘటన హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా రెడ్డిగూడేనికి చెందిన పెదగమళ్ల హేమాంబరధర్‌ (45), రజిత (39) పదకొండేళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లి స్థిరపడ్డారు. వీరికి కుమార్తె భవజ్ఞ (9), కుమారుడు ఫర్విత్‌(6) ఉన్నారు. రజిత తండ్రి ఆరు నెలల క్రితం చనిపోయారు. అప్పుడు రాలేకపోయిన వీరు స్వగ్రామానికొచ్చి అందరినీ చూడాలనుకొని ఈనెల 25న ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. అక్కడ షాపింగ్‌, ఇతర పనులు ముగించుకొని మంగళవారం రాత్రి రెడ్డిగూడెం బయల్దేరారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తిరుమలగిరి వద్దకు రాగానే అతివేగం కారణంగా కారు డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో హేమాంబరధర్‌ దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. చిన్నారులు భవజ్ఞ, ఫర్విత్‌తో పాటు డ్రైవర్‌ తిరుపతిరావుకు గాయాలయ్యాయి. పోలీసులు మృతదేహాలు, క్షతగాత్రులను సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స నిమిత్తం డ్రైవర్‌ తిరుపతిరావును విజయవాడకు తరలించారు. బుధవారం సాయంత్రం రెడ్డిగూడేనికి చేరుకున్న మృతదేహాలను చూసిన కుటుంబసభ్యులు, బంధువులు బోరున విలపించారు. కన్నబిడ్డలు ఇంటికి వస్తున్న తరుణంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో మృతుడి తండ్రి సుబ్బారావు, తల్లి రోదన హృదయవిదారకంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని