మద్యానికి బానిసై అమ్మ ఉసురు తీశాడు.. ఆపై సాధారణ మరణంగా నమ్మించబోయి..

తల్లి మృతిని తొలుత సాధారణ మరణంగా నమ్మించాడా సుపుత్రుడు! మద్యానికి బానిసై అమ్మను గొంతు నులిమి దారుణంగా చంపేశాడు. అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా మృతదేహం నోటి నుంచి రక్తం కారుతుండటంతో

Updated : 28 Apr 2022 08:51 IST

డబ్బు కోసం నిజామాబాద్‌ జిల్లాలో ఓ కుమారుడి దుర్మార్గం

బోధన్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: తల్లి మృతిని తొలుత సాధారణ మరణంగా నమ్మించాడా సుపుత్రుడు! మద్యానికి బానిసై అమ్మను గొంతు నులిమి దారుణంగా చంపేశాడు. అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా మృతదేహం నోటి నుంచి రక్తం కారుతుండటంతో గ్రామస్థులకు అనుమానం వచ్చింది. నిలదీయగా హత్య చేసినట్లు అతడు అంగీకరించాడు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం ఎరాజ్‌పల్లిలో బుధవారం వెలుగు చూసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఎరాజ్‌పల్లికి చెందిన మంజుల (42).. పెద్దకొడుకు గంగాప్రసాద్‌(19)తో కలిసి ఉంటున్నారు. పదో తరగతి వరకు చదివిన అతడు మద్యానికి బానిసయ్యాడు. పనీపాట లేదు. భర్త భాస్కర్‌ ఏడాది కిందట చనిపోవడంతో రైతుబీమాకు సంబంధించి రూ.5 లక్షలు వచ్చాయి. వాటి వివరాలు చెప్పాలని పలుమార్లు తల్లితో గొడవపడ్డాడు. మంగళవారం రాత్రి మళ్లీ ఘర్షణ జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న గంగాప్రసాద్‌ అర్ధరాత్రి సమయంలో తల్లి పడుకుందని నిర్ధారించుకొని గొంతు నులిమి హత్యచేశాడు. నిందితుణ్ని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ సీఐ రవీంద్రనాయక్‌, ఎస్సై సందీప్‌ తెలిపారు.

ఏడాదిన్నరలో నాలుగో మరణం

మంజుల కుటుంబంలో ఐదుగురుండగా ఆమె సహా ఏడాదిన్నరలో నలుగురు చనిపోయారు. మంజుల చిన్న కుమారుడు అనిల్‌ సంవత్సరంన్నర కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త భాస్కర్‌ మత్స్యకారుడు. ఏడాది క్రితం చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి నీటిలో మునిగి చనిపోయారు. గంగాప్రసాద్‌ నానమ్మ లక్ష్మి వృద్ధాప్యంతో మరణించారు. అందరూ దూరమైనా మిగిలిన ఒక్క కుమారుడిని చూసుకొంటూ బతికేద్దామనుకున్న ఆ తల్లి పాలిట అతడే కాలయముడయ్యాడు. కుటుంబంలో ఉన్న నలుగురూ చనిపోగా.. గంగాప్రసాద్‌ కటకటాలపాలయ్యాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని