Telangana News: పెదనాన్న కామ పిశాచి... పెద్దమ్మ కాసుల రాకాసి

వారు అవటానికే పెదనాన్న.. పెద్దమ్మలు. వారి బుద్ధులు, చేష్టలు మాత్రం వక్రం... నికృష్టం. తల్లిదండ్రులను కోల్పోయిన 14 ఏళ్ల బాలికను ఎనిమిదేళ్ల క్రితం అక్కున చేర్చుకున్నట్టు చేర్చుకొని ఇప్పుడు పెదనాన్న వయసు.. వావి వరసలు మర్చిపోయి ప్రవర్తిస్తే.. డబ్బు కక్కుర్తితో పెద్దమ్మ ఆ యువతిని ఓ వ్యక్తి అప్పగించి దుర్బుద్ధి చూపింది.

Updated : 29 Apr 2022 07:31 IST

 మానసిక వికలాంగురాలిపై పెదనాన్న అత్యాచారం

డబ్బు కక్కుర్తితో యువతిని ఏఆర్‌ కానిస్టేబుల్‌కు అప్పగించిన పెద్దమ్మ

నిజామాబాద్‌ నగరంలో అమానవీయ ఘటన

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: వారు అవటానికే పెదనాన్న.. పెద్దమ్మలు. వారి బుద్ధులు, చేష్టలు మాత్రం వక్రం... నికృష్టం. తల్లిదండ్రులను కోల్పోయిన 14 ఏళ్ల బాలికను ఎనిమిదేళ్ల క్రితం అక్కున చేర్చుకున్నట్టు చేర్చుకొని ఇప్పుడు పెదనాన్న వయసు.. వావి వరసలు మర్చిపోయి ప్రవర్తిస్తే.. డబ్బు కక్కుర్తితో పెద్దమ్మ ఆ యువతిని ఓ వ్యక్తి అప్పగించి దుర్బుద్ధి చూపింది. ఎంత దైన్యమంటే వీరిద్దరి దాష్టీకం హద్దులు మీరి సాగుతున్నా వాటి గురించి తెలుసుకోలేని స్థితి ఆమెది! ఎందుకంటే ఆమె దివ్యాంగురాలు. మానసిక వైకల్యంతో ఉన్న ఆమె తనకు ఏం జరిగినా బయటకు వ్యక్తం చేయలేని నిస్సహాయురాలు. ప్రస్తుతం బాధిత యువతి 8 నెలల గర్భిణి. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకొంది. గురువారం ఉదయం ఇది వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్‌ రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఓ జంట నిజామాబాద్‌లో కాపురం ఉంటోంది. భర్త వయసు 61. అతడి సోదరుడు.. భార్య ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందారు. వారికి ఇద్దరు కుమార్తెలు. ఒకరి వయసు 14 కాగా మరొకరికి రెండేళ్లు. తల్లిదండ్రుల్ని కోల్పోవడంతో పెద్ద కుమార్తె మానసిక వైకల్యానికి గురైంది. ఆ ఇద్దర్నీ నిజామాబాద్‌లో ఉండే పెద్దమ్మ, పెదనాన్న తెచ్చుకొని సాకుతున్నారు. ప్రస్తుతం వారిలో ఒకరికి 22 ఏళ్లు... మరొకరికి పదేళ్లు.

కన్న కూతురిలా చూడాల్సిన పెద్దమ్మే..

యువతిని కన్న కూతురి కంటే ఎక్కువగా చూడాల్సి ఉండగా పెద్దమ్మ దారుణానికి పాల్పడింది. సమీపాన ఉండే ఏఆర్‌ కానిస్టేబుల్‌ చంద్రకాంత్‌ (56) నుంచి డబ్బు ఆశించి ఆమెను అప్పగించింది. భార్య ఇంట్లో లేని సమయంలో పెదనాన్న సైతం బాధితురాలిపై అత్యాచారం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాధితురాలి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో విషయం ఇన్నాళ్లూ బయటకు పొక్కలేదు. బాధితురాలి చెల్లి ద్వారా తొలుత ఈ విషయం బయటకొచ్చింది. ఈ ఘటనలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ చంద్రకాంత్‌, బాధితురాలి పెదనాన్న, పెద్దమ్మలను పోలీసులు నిందితులుగా చేర్చారు. బాధితురాలిని సంరక్షణ నిమిత్తం సఖీ కేంద్రానికి తరలించారు.

ఏఆర్‌ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు

యువతిపై అత్యాచార ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ ఏఆర్‌ కానిస్టేబుల్‌ చంద్రకాంత్‌ను సీపీ నాగరాజు సస్పెండ్‌ చేశారు. గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు