అప్పు తిరిగివ్వలేదనే బాధతో స్నేహితుడి ఇంటి వద్ద నిరసన.. అక్కడే మృత్యువాత

అప్పు తీసుకున్నతను తిరిగి ఇవ్వలేదనే బాధతో అతని ఇంటి ముందు నిరసనకు దిగిన వ్యక్తి చివరికి అక్కడే ప్రాణాలొదిలారు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లి గ్రామంలో గురువారం జరిగిందీ విషాదం. కేశవపట్నం ఏఎస్సై

Updated : 29 Apr 2022 10:11 IST

శంకరపట్నం, న్యూస్‌టుడే: అప్పు తీసుకున్నతను తిరిగి ఇవ్వలేదనే బాధతో అతని ఇంటి ముందు నిరసనకు దిగిన వ్యక్తి చివరికి అక్కడే ప్రాణాలొదిలారు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లి గ్రామంలో గురువారం జరిగిందీ విషాదం. కేశవపట్నం ఏఎస్సై మల్లారెడ్డి కథనం ప్రకారం.. మెట్‌పల్లి గ్రామానికి చెందిన ఈరెల్లి సంపత్‌(35) ఒగ్గు కళాకారుడు. అదే గ్రామానికి చెందిన స్నేహితుడు సతీష్‌కు మూడేళ్ల కిందట రూ.10 లక్షలు అప్పుగా ఇచ్చారు. ఏడాది తరువాత సతీష్‌ రూ.3 లక్షలు తిరిగిచ్చాడు. రూ.7 లక్షలు జులై 15, 2021లో ఇచ్చేలా పెద్దల సమక్షంలో ఒప్పంద పత్రం రాసుకున్నారు. గడువు తీరినా ఇవ్వకపోవడం, పలుమార్లు అడిగినా సరైన సమాధానం రాకపోవడంతో ఈ నెల 16 నుంచి సతీష్‌ ఇంటి ఆవరణలో ప్రధాన ద్వారానికి ఎదురుగా మంచంపై పడుకుని నిరసనకు దిగారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురవగా, తల్లిదండ్రులు భోజనం పెడుతూ మాత్రలు వేస్తూ వచ్చారు. ఈ పరిణామాలతో సతీష్‌, కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసుకుని ఎటో వెళ్లిపోయారు. అప్పు తిరిగి రాలేదనే మనోవేదనకు.. అనారోగ్యం తోడై బుధవారం రాత్రి సంపత్‌ అక్కడే మరణించారు. సంపత్‌ మరణానికి సతీష్‌ కారణమంటూ ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం ఆందోళనకు దిగారు. సతీష్‌ ఇంటి ముందే మృతదేహాన్ని ఖననం చేసేందుకు ప్రయత్నించారు. న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని