Crime News: తుపాకీతో బెదిరించి బ్యాంకులో నగదు దోపిడీ

బ్యాంకు క్యాషియర్‌ను తుపాకీతో బెదిరించి నగదు దోచుకెళ్లిన ఘటన అనకాపల్లి జిల్లా కశింకోట మండలం నర్సింగబిల్లిలో శనివారం సంచలనం రేపింది. పోలీసులు, బ్యాంకు సిబ్బంది కథనం

Updated : 01 May 2022 07:36 IST

అనకాపల్లి పట్టణం, కశింకోట, న్యూస్‌టుడే: బ్యాంకు క్యాషియర్‌ను తుపాకీతో బెదిరించి నగదు దోచుకెళ్లిన ఘటన అనకాపల్లి జిల్లా కశింకోట మండలం నర్సింగబిల్లిలో శనివారం సంచలనం రేపింది. పోలీసులు, బ్యాంకు సిబ్బంది కథనం మేరకు.. నర్సింగబిల్లిలో ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకు (ఏపీజీవీబీ) 16వ నంబరు జాతీయ రహదారికి పక్కనే ఉంది. మధ్యాహ్నం 2.07 గంటలకు బ్యాంకు మేనేజర్, గుమస్తా భోజనానికి వెళ్లగా, క్యాషియర్‌ ప్రతాప్‌రెడ్డి మాత్రమే సీటులో ఉన్నారు. ఖాతాదారులు కూడా లేరు. నేవీ బ్లూ కలర్‌ జాకెట్, జీన్స్‌ ప్యాంట్‌ ధరించిన వ్యక్తి నెత్తిన హెల్మెట్, ముఖానికి మాస్కుతో లోపలకు ప్రవేశించాడు. క్యాషియర్‌ వద్దకు వచ్చి తుపాకీ చూపించాడు. కౌంటర్‌లోని నగదును తాను తెచ్చిన బ్యాగులో వేయాలని హిందీలో బెదిరించాడు. క్యాషియర్‌ రూ.3,31,320 నగదు బ్యాగులో వేశాడు. అనంతరం లాకర్‌ తెరవమని దొంగ బెదిరించగా, క్యాషియర్‌ లోపలికి వెళ్లి గడియ పెట్టేశారు. దీంతో దుండగుడు పరారయ్యాడు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు, క్లూస్‌టీం సిబ్బంది వచ్చి వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. ఎస్పీ గౌతమి సాలి, డీఎస్పీ బి.సునీల్‌ ఘటనా స్థలిని పరిశీలించారు. రాజమహేంద్రవరం మార్గంలో ఎలమంచిలి మండలం కొక్కిరాపల్లి వద్ద ఆగంతుకుడు బైక్‌పై వెళ్తున్న దృశ్యం సీసీ కెమెరాలో రికార్డయ్యింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దీనబంధు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని