Crime News: నగర శివార్లలో జంట హత్యలు

హైదరాబాద్‌ నగర శివారులో జంటహత్యలు సంచలనంగా మారాయి. నిర్మానుష్య ప్రాంతానికి వచ్చిన ఒక యువకుడిని, మహిళను దుండగులు అతి దారుణంగా హతమార్చారు. మూడు రోజుల తరువాత వెలుగు చూసిన ఈ

Updated : 04 May 2022 06:25 IST

 యువకుడు, మహిళను దారుణంగా చంపిన దుండగులు

మూడు రోజుల తర్వాత వెలుగు చూసిన ఘాతుకం

వివాహేతర సంబంధమే కారణమా?

ఈనాడు - హైదరాబాద్, న్యూస్‌టుడే - అబ్దుల్లాపూర్‌మెట్‌: హైదరాబాద్‌ నగర శివారులో జంటహత్యలు సంచలనంగా మారాయి. నిర్మానుష్య ప్రాంతానికి వచ్చిన ఒక యువకుడిని, మహిళను దుండగులు అతి దారుణంగా హతమార్చారు. మూడు రోజుల తరువాత వెలుగు చూసిన ఈ హత్యలకు వివాహేతర సంబంధం కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తగూడెం గ్రామ సమీపంలో ఎన్‌హెచ్‌ 65 పక్కన రెండు మృతదేహాలున్నట్టు మంగళవారం స్థానికులిచ్చిన సమాచారంతో అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు అక్కడికి వెళ్లారు. నగ్నంగా పడి ఉన్న మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారాయి. సమీపంలో నిలిపి ఉన్న ద్విచక్ర వాహనం (టీఎస్‌10ఎఫ్‌బి 2384) ఆధారంగా వివరాలు సేకరించారు. వాహన యజమాని వారాసిగూడకు చెందిన యడ్ల అనిరుధ్‌ను రప్పించారు. ఆయన వచ్చి.. మృతదేహం తన సోదరుడు యశ్వంత్‌ (22)దిగా గుర్తుపట్టారు. అక్కడ దొరికిన చేతిసంచిలోని రసీదు ఆధారంగా మృతురాలు వారాసిగూడకు చెందిన జ్యోతి (30) అని గుర్తించారు. 

ఫోన్‌కాల్‌తో బయటకు..

వారాసిగూడకు చెందిన యడ్ల యశ్వంత్‌ క్యాబ్‌ డ్రైవర్‌. అతడి తండ్రి కొబ్బరిబొండాలు విక్రయించేవారు. యశ్వంత్‌ మొదట్లో డ్రైవర్‌గా పనిచేసి.. ఇటీవలే కారు కొని అద్దెకు తిప్పుతున్నాడు. అదే ప్రాంతంలో జ్యోతి కుటుంబం ఉండేది. ఆమె భర్త స్టీలు సామాన్లు విక్రయించేవాడు. వారికి ఇద్దరు పిల్లలు. ఆమెతో యశ్వంత్‌కు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం సాయంత్రం యశ్వంత్‌కు ఫోన్‌కాల్‌ రావటంతో సోదరుడి ద్విచక్ర వాహనం తీసుకుని 7 గంటల సమయంలో బయటకు వెళ్లాడు. తర్వాత జ్యోతిని వెంటబెట్టుకుని.. సంఘటన స్థలానికి వచ్చి ఉంటాడని పోలీసులు అంచనా వేస్తున్నారు. అగంతకులు వీరిని అనుసరించి.. హతమార్చి ఉండవచ్చని భావిస్తున్నారు. యశ్వంత్‌ మర్మాంగాన్ని నిందితులు ఛిద్రం చేశారు. పొట్ట, గొంతు, తలపై పొడిచారు. మహిళ తలపై బండరాతితో మోదినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలంలో ప్లాస్టిక్‌ చాప, కండోమ్స్, శీతలపానీయాలు తదితర వస్తువులను గుర్తించారు. 

నిందితుల కోసం మూడు బృందాలు

ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్‌ ఇన్‌స్పెక్టర్‌ స్వామి హత్యాస్థలాన్ని పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. జ్యోతి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. యశ్వంత్‌కు వారాసిగూడలోని కొందరితో పాతగొడవలు ఉన్నా, అవి హత్యలు చేసేంత పెద్దవి కాదని అనిరుధ్‌ చెప్పారు. 

దుర్వాసనతో ఆనవాళ్లు 

హత్యలు జరిగిన ప్రాంతం ముళ్లచెట్లు, పొదలతో నిండి ఉంటుంది. కల్లుగీత కోసం వెళ్లిన కార్మికుడొకరు తాటిచెట్టు ఎక్కినప్పుడు దుర్వాసన రావటంతో మృతదేహాలను గుర్తించాడు. గ్రామంలోకి వెళ్లి విషయం చెప్పటంతో పోలీసులకు సమాచారం చేరింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని