Updated : 05 May 2022 10:51 IST

Crime News: ప్రేమపై పగ.. నడిరోడ్డుపై హత్య

కొత్తదంపతులను వెంబడించి దాడి
భర్తను హతమార్చిన యువతి సోదరుడు

ఈనాడు- హైదరాబాద్‌, న్యూస్‌టుడే - సరూర్‌నగర్‌ క్రైం: పెద్దలను కాదని ప్రేమించి పెళ్లి చేసుకుందని.. ఆ యువతి కుటుంబసభ్యులు ఆమె భర్తపై మారణాయుధాలతో దాడి చేసి హతమార్చిన వైనమిది. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ పోలీస్‌ఠాణా పరిధిలోని జీహెచ్‌ఎంసీ కార్యాలయం రహదారిపై బుధవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. తన సోదరుడే భర్తను కిందపడేసి ఇనుపరాడ్డుతో తలపై విచక్షణ రహితంగా కొట్టి చంపేయడంతో ఆ యువతి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. రక్తపు మడుగులో భర్తను చూసి పెద్దగా రోదిస్తూ కేకలు వేసింది. అప్రమత్తమైన స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు.. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన బిల్లాపురం నాగరాజు, మర్పల్లి సమీపంలోని ఘనాపూర్‌ గ్రామంలో నివసించే సయ్యద్‌ ఆశ్రిన్‌ సుల్తానా.. ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసి ఆశ్రిన్‌ కుటుంబ సభ్యులు అతడిని హెచ్చరించారు. ఆశ్రిన్‌ను పెళ్లిచేసుకుందామని నిర్ణయించుకున్న నాగరాజు.. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కార్ల కంపెనీలో కొద్దినెలల కిందట సేల్స్‌మన్‌గా చేరాడు. కొత్త సంవత్సరం రోజు ఆశ్రిన్‌ను రహస్యంగా కలుసుకున్న నాగరాజు కొద్దిరోజుల్లో పెళ్లి చేసుకుందామని చెప్పాడు. జనవరి చివరి వారంలో ఆమె పారిపోయి హైదరాబాద్‌కు వచ్చింది. లాల్‌దర్వాజలోని ఆర్యసమాజ్‌లో జనవరి 31న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఎవరూ తమను గుర్తించకుండా నాగరాజు వేరే ఉద్యోగంలోకి మారిపోయాడు. వీరు హైదరాబాద్‌లో ఉంటున్నట్లు ఆశ్రిన్‌ కుటుంబ సభ్యులు పసిగట్టడంతో కొత్తజంట రెండు నెలల కిందట విశాఖపట్నం వెళ్లి అక్కడే ఉన్నారు. ఎవరూ తమను వెంటాడడం లేదని భావించి.. అయిదు రోజుల కిందట మళ్లీ నగరానికి వచ్చారు. సరూర్‌నగర్‌లోని పంజా అనిల్‌కుమార్‌ కాలనీలో నివసిస్తున్నారు. వీరి కదలికలను గుర్తించిన ఆశ్రిన్‌ కుటుంబ సభ్యులు మాటువేశారు. బుధవారం రాత్రి నాగరాజు, ఆశ్రిన్‌లు కాలనీలోంచి బయటకు రాగానే ఆశ్రిన్‌ సోదరుడు, అతడి స్నేహితుడు బైక్‌పై వారిని వెంబడించి దాడికి పాల్పడ్డారు. నాగరాజును ఇనుపరాడ్‌తో కొట్టి హత్య చేశారు. పోలీసులు ఆశ్రిన్‌ సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. నాగరాజు బంధువులు ఆశ్రిన్‌ను వెంట తీసుకెళ్లారు. హత్యపై సాక్ష్యాధారాలు సేకరించామని ఏసీపీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.


Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts