Published : 06 May 2022 07:36 IST

Crime News: పరువుహత్యకు 30 రోజుల రెక్కీ

సరూర్‌నగర్‌ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

ఈనాడు, హైదరాబాద్‌/న్యూస్‌టుడే, నాగోల్‌: తన సోదరి ప్రేమపెళ్లి చేసుకుందనే పగతో ఆ యువకుడు రగిలిపోయాడు. కొత్త దంపతుల ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించి కనుక్కున్నాడు. తన సోదరిని పెళ్లాడిన వ్యక్తిని హతమార్చడానికి దాదాపు నెల రోజులపాటు రెక్కీ నిర్వహించాడు. బుధవారం రాత్రి అతడిని నడిరోడ్డుపై మట్టుపెట్టాడు. సరూర్‌నగర్‌లో సంచలనం రేకెత్తించిన పరువు హత్య కేసు నేపథ్యమిది. యువతి సోదరుడు సయ్యద్‌ మోబిన్‌ అహ్మద్‌(30).. అతడి బావ మహ్మద్‌ మసూద్‌ అహ్మద్‌(29)తో కలసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధరించారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నాగోలులోని రాచకొండ పోలీసు కమిషనర్‌ క్యాంపు కార్యాలయంలో గురువారం ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ వివరాలు వెల్లడించారు.

చదువుకున్నప్పటి నుంచే ప్రేమ
వికారాబాద్‌ జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన బిల్లిపురం నాగరాజు (25), ఆశ్రిన్‌ సుల్తానా (25) ఇంటర్మీడియట్‌ వరకు కలిసే చదువుకున్నారు. ఆ క్రమంలో వారి మధ్య ప్రేమ మొదలైంది. కొన్నాళ్ల కిందట ఆశ్రిన్‌ కుటుంబం ఐడీపీఎల్‌ కాలనీ గురుమూర్తినగర్‌కు వచ్చేసింది. ఆమె తండ్రి చిన్నప్పుడే దూరమయ్యాడు. తల్లి, ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలున్నారు. పండ్ల వ్యాపారం చేసే పెద్దన్న సయ్యద్‌ మోబిన్‌ అహ్మద్‌ సంపాదనే కుటుంబానికి ఆధారం. నాగరాజు డిగ్రీ పూర్తి చేసి బాచుపల్లిలోని ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసేవాడు. తరచూ ఆశ్రిన్‌తో ఫోన్‌లో మాట్లాడేవాడు. విషయం తెలిసి.. సయ్యద్‌ మోబిన్‌ అతడిని పలుమార్లు హెచ్చరించాడు. ఆశ్రిన్‌ జనవరి 30న నాగరాజు వద్దకు వచ్చేసింది. వారిద్దరూ ఫిబ్రవరి 1న ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. అదేరోజు ఆమె కుటుంబ సభ్యులు బాలానగర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, అదృశ్యం కేసు నమోదైంది.

పోలీసులు చెప్పినా వినలేదు
పెళ్లి అనంతరం నాగరాజు, ఆశ్రిన్‌ బాలానగర్‌ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి నచ్చచెప్పి పంపారు. సోదరిని తనతో పంపేయాలంటూ సయ్యద్‌ మోబిన్‌ నాగరాజును ప్రాధేయపడ్డాడు. కానీ అతడు అంగీకరించలేదు. ప్రాణభయంతో కొత్తజంట కొన్నాళ్లు విశాఖపట్నంలో తలదాచుకున్నారు. కోపావేశాలు చల్లారి ఉంటాయనే ఉద్దేశంతో ఇద్దరూ ఇటీవలే మళ్లీ హైదరాబాద్‌ చేరారు. నాగరాజు సరూర్‌నగర్‌ పంజా అనిల్‌కుమార్‌ కాలనీలోని బంధువు ఇంట్లో గది అద్దెకు తీసుకున్నాడు. మలక్‌పేట్‌లోని కార్ల దుకాణంలో ఉద్యోగంలో చేరాడు. ఇంతలో సయ్యద్‌ మోబిన్‌.. నాగరాజు ఆచూకీ కనుక్కున్నాడు.

పండ్ల కత్తి.. సెంట్రింగ్‌ రాడ్‌..
నాగరాజు హత్యకు నెల రోజులు రెక్కీ నిర్వహించిన సయ్యద్‌ మోబిన్‌ రెండో సోదరి భర్త మహ్మద్‌ మసూద్‌ అహ్మద్‌ సాయం కోరాడు. ఇద్దరూ ద్విచక్ర వాహనంపై బుధవారం మధ్యాహ్నం కార్ల షోరూం వద్దకు చేరారు. అక్కడి నుంచి నాగరాజును అనుసరిస్తూ పంజా అనిల్‌నగర్‌ కాలనీకి చేరి మాటువేశారు. రాత్రివేళ ద్విచక్రవాహనంపై బయటకు వచ్చిన నాగరాజు, ఆశ్రిన్‌లను వెంబడించారు. నాగరాజు తలపై సెంట్రింగ్‌రాడ్‌తో బలంగా కొట్టి, కత్తితో దాడి చేయటంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. స్థానికులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించటంతో పారిపోయారు. ఎల్బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి సారథ్యంలో పోలీసులు గాలించి నిందితులను పట్టుకున్నారు. నాగరాజు ఎస్సీ వర్గానికి చెందటంతో ప్రభుత్వం అందించే పరిహారం అతడి కుటుంబానికి చేరుతుందని డీసీపీ తెలిపారు. నాగరాజు కుటుంబ సభ్యులు ఆశ్రిన్‌ను తమ వెంట మర్పల్లి తీసుకెళ్లారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts