Crime News: అలా చూడలేక చంపేశాడు!

వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య, ఆమె ప్రియుడిని హతమార్చేందుకు భర్త పక్కా పథకం చేశాడు. అదను చూసి దారుణంగా హతమార్చాడు. రంగారెడ్డి జిల్లా

Published : 06 May 2022 06:41 IST

పథకం ప్రకారమే జంట హత్యలు

భార్య, భర్త, ప్రియుడు.. ముగ్గురూ కలిసే ఘటనా స్థలానికి

ఈనాడు, హైదరాబాద్‌/నాగోల్‌, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య, ఆమె ప్రియుడిని హతమార్చేందుకు భర్త పక్కా పథకం చేశాడు. అదను చూసి దారుణంగా హతమార్చాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కొత్తగూడలో జరిగిన ఈ జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. రాచకొండ పోలీసు కమిషనర్‌ క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు.

విజయవాడకు చెందిన కొలిపాక శ్రీనివాసరావు(49) భార్య 18 ఏళ్ల క్రితం మరణించగా.. అప్పటికే విడాకులు తీసుకొని ఒంటరిగా ఉన్న సత్యవతి అలియాస్‌ జ్యోతి(35)ని వివాహమాడాడు. వీరికి ఇద్దరు మగ పిల్లలు. ప్రస్తుతం విజయవాడలో నాయనమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. ఏడాది కిందట శ్రీనివాసరావు, జ్యోతి ఉపాధి కోసం హైదరాబాద్‌ వచ్చి వారాసిగూడలో ఉంటున్నారు. అక్కడ క్యాబ్‌ డ్రైవర్‌ ఎడ్ల యశ్వంత్‌(22)తో జ్యోతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి శ్రీనివాసరావు భార్యను మందలించినా మార్పు రాలేదు. దీంతో యశ్వంత్‌ను చంపేందుకు ఏప్రిల్‌లో పథకం వేసినా అది అమలు చేయటం కుదరలేదు.

విజయవాడకు వెళ్దామని..
భార్యలో మార్పు రాకపోవడంతో విజయవాడకు మకాం మార్చేందుకు, మే 1న ఇల్లు ఖాళీ చేసి సామాన్లు అక్కడకు పంపాడు. అదే రోజు సాయంత్రం జ్యోతి చివరిసారిగా ప్రియుడిని కలుస్తానంటూ భర్తను కోరింది. అదను కోసం ఎదురుచూస్తున్న భర్త అంగీకరించాడు. ఆమె ద్వారా యశ్వంత్‌కు ఫోన్‌ చేయించి రప్పించాడు. ముగ్గురూ కలిసి విజయవాడ వెళదామని రాత్రి 7 గంటల సమయంలో వారాసిగూడ నుంచి రెండు వాహనాలపై బయల్దేరారు. ఎల్బీనగర్‌ వద్ద మద్యం, శీతలపానీయం, బిర్యానీ కొనుక్కున్నారు. రాత్రి 11 గంటలకు కొత్తగూడ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి చేరుకొన్నారు. అక్కడ శ్రీనివాసరావు మద్యం తాగుతుండగా.. జ్యోతి, యశ్వంత్‌లు బిర్యానీ తిని, పక్కన ఏకాంతంగా ఉన్నారు. అది చూసిన శ్రీనివాసరావు అప్పటికే ద్విచక్ర వాహనంలో సిద్ధంగా ఉంచిన సుత్తి, స్క్రూడ్రైవర్‌ తీసుకుని వారిపై దాడి చేశాడు. ఇద్దరూ మరణించారని నిర్ధారించుకున్నాక మృతుల సెల్‌ఫోన్లు తీసుకొని ద్విచక్ర వాహనంపై విజయవాడ చేరాడు.

ఘటనా స్థలంలో దొరికిన జ్యోతి చేతి సంచిలో చెప్పుల రశీదు కనిపించగా.. అందులో ఉన్న ఫోన్‌ నంబర్‌ ఆధారంగా పోలీసులు కూపీ లాగారు. ఆ నంబరు చంపాపేటకు చెందిన శ్రీనివాస్‌దిగా గుర్తించి ఫోన్‌ చేయటంతో విషయం వెలుగుచూసింది. జ్యోతి తనకు స్నేహితుడి ద్వారా పరిచయమైందని, తానే చెప్పులు కొనిచ్చానని వెల్లడించాడు. యశ్వంత్‌తో అక్రమ సంబంధం విషయం తెలిసిన భర్తే ఈ హత్యలకు పాల్పడి ఉంటాడని అతడిచ్చిన సమాచారంతో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడొక్కడే జంట హత్యలు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని