Andhra News: వేధింపులు తట్టుకోలేక దంపతుల ఆత్మహత్యాయత్నం

పోలీసులు, వైకాపా నాయకులు వేధిస్తున్నారని నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం ఎర్రగుడి గ్రామానికి చెందిన తలారి లక్ష్మీనారాయణ, రాములమ్మ దంపతులు గురువారం పురుగుల

Published : 06 May 2022 07:58 IST

పోలీసులు, వైకాపా నాయకులే కారణమంటూ లేఖ

పదేపదే సారా కేసులు పెడుతున్నారని మనస్తాపం

బనగానపల్లి, న్యూస్‌టుడే: పోలీసులు, వైకాపా నాయకులు వేధిస్తున్నారని నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం ఎర్రగుడి గ్రామానికి చెందిన తలారి లక్ష్మీనారాయణ, రాములమ్మ దంపతులు గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారి వద్ద జిల్లా ఎస్పీకి రాయించుకున్న ఓ లేఖ లభించింది. బాధితుల బంధువుల కథనం మేరకు.. లక్ష్మీనారాయణ, రాములమ్మ దంపతులు నాటుసారా కాస్తున్నారని గ్రామ వైకాపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీరిపై పోలీసులు కేసులు పెడుతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వైకాపా మద్దతుదారులే నాటుసారా తయారు చేస్తున్నా.. ఈ దంపతులనే కొట్టి ఒప్పించి కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఊరు విడిచి వెళ్లిపోతామన్నా, వైద్యం కోసం గుంటూరు వెళ్లినా పోలీసులు ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆవేదన చెందారు. వీరి 2.90 ఎకరాల పొలాన్ని వైకాపా నాయకుడు తన బంధువుల పేరిట రాయించుకున్నారని వీరి వద్ద లభించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా అడుగడుగునా చిత్రహింసలకు గురిచేస్తున్నారని, తమకు ఏం జరిగినా వైకాపా నాయకులు, పోలీసులే బాధ్యులని రాయించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితులను వారి కుమారుడు శివసతీష్‌కుమార్‌ బనగానపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ గంటపాటు వైద్య సేవలందించి మెరుగైన చికిత్సకు నంద్యాల జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు.

పోలీసులను బెదిరించేందుకే:
‘గ్రామంలో నాటుసారా తయారు చేస్తున్న ఇరువర్గాలపై కేసులు నమోదు చేశాం. మాకు పార్టీలతో సంబంధం లేదు. పురుగుల మందు తాగిన రాములమ్మపై ఐదు కేసులు నమోదు చేసి బైండోవర్‌ చేసి తహసీల్దారుకు అప్పగించాం. సారా తయారీ వద్దన్నందుకు.. పోలీసులను బెదిరించేందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కావాలనే తమపై బురుద జల్లుతున్నారు’ అని సీఐ సుబ్బరాయుడు తెలిపారు.

-సుబ్బరాయుడు, సీఐ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని