నాడు అక్క బలవన్మరణం.. బాధ్యులకు శిక్ష పడలేదని తమ్ముడి ఆత్మహత్య

ఆ కుటుంబంలో గతంలో వివిధ కారణాలతో ఇద్దరు మహిళలు ఆత్మహత్యలకు పాల్పడగా.. ఇప్పుడు వారి సోదరుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల

Published : 08 May 2022 09:26 IST

గతంలో మరో సోదరిదీ బలవన్మరణమే

టేకుమట్ల, న్యూస్‌టుడే: ఆ కుటుంబంలో గతంలో వివిధ కారణాలతో ఇద్దరు మహిళలు ఆత్మహత్యలకు పాల్పడగా.. ఇప్పుడు వారి సోదరుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్‌(వి)లో శనివారం సాయంత్రం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లద్దునూరి సారయ్య, భద్రమ్మలకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్దకుమార్తె పద్మకు ఉద్యోగం రాలేదన్న బాధతో 15 ఏళ్ల కిందట ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో మనోవేదనకు గురైన తండ్రి సారయ్య 12 ఏళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. ఏడాదిన్నర క్రితం రెండో కుమార్తె సృజన (22)ను భూపాలపల్లికి చెందిన సింగరేణి ఉద్యోగికి ఇచ్చి వివాహం చేశారు. వరకట్న వేధింపుల కారణంగా ఆమె పది నెలల కిందట ఉరివేసుకొని చనిపోయింది. సృజన మృతికి కారకులైన వ్యక్తులకు శిక్ష పడలేదని, వారు బెయిల్‌పై దర్జాగా తిరుగుతున్నారని మనస్తాపం చెందిన తమ్ముడు దిలీప్‌ (21) శనివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సారయ్య దంపతులు ఉన్న ఎకరం భూమిని సాగు చేసుకుంటూ.. కూలి పనులు చేస్తూ పిల్లలను పెంచారు. దిలీప్‌ డిగ్రీ చదువుతున్నాడు. ఎదిగిన పిల్లలు ముగ్గురూ ఆత్మహత్యలకు పాల్పడడంతో భద్రమ్మకు కడుపుకోత మిగిలింది. ఆమె కుమారుడి మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. కుమార్తె ఆత్మహత్యకు కారకులైన వారికి శిక్ష పడలేదన్న మనోవేదనతోనే తన కుమారుడు దిలీప్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడని భద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని