Crime News: యువతి పేరిట వల.. ద్విపాత్రాభినయంతో మోసగాడి బురిడీ

ఒకే ఒక్కడు.. యువతిగా, సంపన్నుడిగా ద్విపాత్రాభినయంతో 500 మందికి పైగా అమ్మాయిలను, మహిళలను వంచించాడు. గత ఆరేళ్లలో వారి నుంచి రూ. 3.5 కోట్లు కొట్టేశాడు. తప్పించుకు తిరుగుతున్న ఈ ఘరానా మోసగాడిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌

Updated : 08 May 2022 07:14 IST

ఓ ఎమ్మెల్యే ఫొటోతోనూ వంచన
500 మంది మహిళల నుంచి రూ. 3.5 కోట్ల స్వాహా

ఈనాడు, హైదరాబాద్‌: ఒకే ఒక్కడు.. యువతిగా, సంపన్నుడిగా ద్విపాత్రాభినయంతో 500 మందికి పైగా అమ్మాయిలను, మహిళలను వంచించాడు. గత ఆరేళ్లలో వారి నుంచి రూ. 3.5 కోట్లు కొట్టేశాడు. తప్పించుకు తిరుగుతున్న ఈ ఘరానా మోసగాడిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జోగాడ వంశీకృష్ణ (31).. హర్ష, హర్షవర్ధన్‌ తదితర మారుపేర్లతో తిరుగుతుంటాడు. సొంతూరు ఏపీలోని రాజమహేంద్రవరం. బీటెక్‌ పూర్తిచేసి 2014లో ఉద్యోగ ప్రయత్నంలో హైదరాబాద్‌కు వచ్చాడు. రెండేళ్లు కూకట్‌పల్లి వైబ్స్‌ హోటల్‌లో పనిచేశాడు. స్నేహితులతో కలిసి క్రికెట్‌, గుర్రపు పందాలు ఆడేవాడు. ఆరేళ్ల క్రితం ట్రావెల్‌ కన్సల్టెన్సీ కార్యాలయంలో ఉద్యోగిగా చేరాడు. అక్కడకు వచ్చిన యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పెద్దఎత్తున డబ్బు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో అప్పట్లో అతడిని కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు.

ఎమ్మెల్యే ఫొటోతో టోకరా

యువతుల పేర్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాలు తెరిచి, మహిళలు, యువతులకు తనను తాను యువతిగా పరిచయం చేసుకునేవాడు. హర్ష అలియాస్‌ హర్షవర్ధన్‌ అనే సంపన్నుడు సేవా కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తాడంటూ వారికి నకిలీ ఖాతాల నుంచి తన ఫోన్‌ నంబర్లు పంపేవాడు. ఫోన్‌ చేసిన అమ్మాయిలతో తానే హర్షనంటూ సంభాషించేవాడు. చాటింగ్‌ చేసేవాడు. పొరుగు రాష్ట్రానికి చెందిన ఒక ఎమ్మెల్యే ఫొటోతో ఇన్‌స్టా ఖాతా సృష్టించి అందమైన అమ్మాయిలకు వల విసిరేవాడు. తానే ఎమ్మెల్యేనంటూ చాటింగ్‌ చేసేవాడు. వారి బ్యాంకు ఖాతాల్లో మొదట రూ.లక్ష జమ చేసేవాడు. ఒక్కసారి పెద్దఎత్తున డబ్బు రావటంతో వారిలో నమ్మకం పెరిగేది. కొన్నాళ్లకు.. తన బ్యాంకు ఖాతాలు నిలిపివేశారని, అత్యవసరంగా డబ్బు కావాలని అడిగేవాడు. వారి నుంచి క్రికెట్‌ బుకీలు, గుర్రపు పందాల నిర్వాహకుల బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము జమ చేయించేవాడు. ఆన్‌లైన్‌ వివాహ వేదికల్లో వితంతువులు, విడాకులు పొందిన మహిళలను ఎంపిక చేసుకొని పెళ్లి చేసుకుంటానంటూ భారీగా డబ్బు వసూలు చేశాడు. ఇలా 2016 నుంచి 500 మందికి పైగా యువతులు, మహిళలు మోసపోయినట్లు తెలుస్తోంది. బాధితుల్లో కేవలం 50-60 మంది మాత్రమే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశంలోని పలు నగరాల్లో తిరుగుతున్న నిందితుడిని సైబర్‌ క్రైమ్‌ పోలీసుల బృందం చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని