శ్రీసత్యసాయి జిల్లాలో మరో ఘోరం: మహిళపై అత్యాచారం... దారుణ హత్య!

శ్రీసత్యసాయి జిల్లాలో మరో దారుణం జరిగింది. బహిర్భూమికి వెళ్లిన బాలింతను కొందరు వ్యక్తులు బండరాళ్లతో తలపై మోది చంపేశారు. అనంతరం మృతదేహాన్ని కొంతదూరం లాక్కెళ్లి పడేశారు. అంతకుముందు ఆమెపై సామూహిక అ

Updated : 10 May 2022 06:44 IST

కనగానపల్లి, అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లాలో మరో దారుణం జరిగింది. బహిర్భూమికి వెళ్లిన బాలింతను కొందరు వ్యక్తులు బండరాళ్లతో తలపై మోది చంపేశారు. అనంతరం మృతదేహాన్ని కొంతదూరం లాక్కెళ్లి పడేశారు. అంతకుముందు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనగానపల్లి మండలానికి చెందిన మహిళకు ఏడేళ్ల కిందట వివాహమైంది. ఆమెకు 7 నెలల కిందట బాబు పుట్టాడు. పది రోజుల క్రితం ఆమె కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్నారు. సోమవారం ఉదయం తన బాబును తోడికోడలుకు అప్పగించి బహిర్భూమికి వెళ్లారు. అప్పటికే అక్కడ కాపుకాసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. 10 గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో ఆమె భర్తకు బంధువులు ఫోన్‌ చేసి చెప్పారు. అనంతరం బంధువుల ఇళ్లలో వాకబు చేశారు. అక్కడా లేకపోవడంతో ఊరి బయట వెతికారు. తల పూర్తిగా ఛిద్రమై విగత జీవిగా పడి ఉన్న బాధితురాలు కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడికి సమీపంలోని ఓ బావి దగ్గర నుంచి బండరాళ్లు తెచ్చి హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

నలుగురిపై అనుమానం

మహిళ హత్య విషయమై బంధువుల్లో కొందరిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గ్రామానికి చెందిన కొందరు ముందస్తు పథకంలో భాగంగానే ఆమెను ఊరి బయటకు పిలిపించి హత్య చేసినట్లు తెలుస్తోంది. చంపడానికి ముందు ఆమెపై సామూహిక అత్యాచారం చేసినట్లు అనుమానిస్తున్నారు. మృతురాలి ఫోన్‌లోని కాల్‌ లిస్టు ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని