Updated : 11 May 2022 08:10 IST

గిరిజన మహిళపై హత్యాచారం.. అపస్మారక స్థితిలో ఉన్నా వదలని దుర్మార్గుడు

చౌటుప్పల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: రెక్కాడితే గానీ డొక్కాడని పేద గిరిజన కుటుంబం. పగటివేళ భర్త పనికి వెళ్లగా చూసిన ఓ దుండగుడు అతడి భార్యపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. మొదటిసారి లైంగికదాడి తర్వాత.. ఆమె అపస్మారకస్థితిలో అచేతనంగా పడి ఉంటే.. మరోసారీ అఘాయిత్యం చేశాడు. ఆమె ప్రాణాలు కోల్పోయాక కాళ్ల పట్టీలు, బంగారు పుస్తెలను దోచుకుని పారిపోయాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం తూప్రాన్‌పేటలో సోమవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటన రాత్రి సమయానికి పోలీసుల దృష్టికి వచ్చింది. వారు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. 24 గంటల్లోపే నిందితుడిని వెతికి పట్టుకున్నారు. అతడి నుంచి వివరాలు రాబడుతున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. విషయం బయటకు చెబుతుందనే భయంతో నిందితుడు ఆమెను చంపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

పొట్టకూటి కోసం వలస వస్తే..

హత్యాచారానికి గురైన గిరిజన మహిళది నాగర్‌ కర్నూల్‌ జిల్లా కోడూరు మండలంలోని ఓ గిరిజన తండా. మార్చి 13న ఆమె భర్తతో పాటు తూప్రాన్‌పేటకు వలస వచ్చారు. వారిద్దరూ హైదరాబాద్‌-విజయవాడ హైవే సమీపంలోని ఒక గోదాము వద్ద కాపలాదారులుగా ఉంటూ.. అక్కడే నివసిస్తున్నారు. భర్త పగటివేళ సమీపంలోని ఇంజనీరింగ్‌ కళాశాలలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం ఆయన విధులకు వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో భార్య కనిపించలేదు. చుట్టుపక్కల వెతకగా.. సమీపంలోని గడ్డివాము దగ్గర రక్తపు మడుగులో శవమై కనిపించింది. ఆయన వెంటనే బావమరిదికి, అత్తమామలకు, పోలీసులకు సమాచారం అందించారు. రాత్రికి రాత్రే రంగంలోకి దిగిన పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. చౌటుప్పల్‌ ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష నిర్వహించారు.

ఒంటరిగా ఉంటుందని గమనించి..

మహిళపై అత్యాచారం చేసింది సంగారెడ్డి జిల్లాకు చెందిన యువకుడు (24) అని పోలీసులు గుర్తించారు. అతడు తూప్రాన్‌పేటలోని సిమెంట్‌ ఇటుకల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. పగటివేళ ఆ మహిళ ఒంటరిగా ఉంటోందని గమనించి.. అత్యాచారానికి తెగించాడు. చౌటుప్పల్‌ ఏసీపీ ఉదయ్‌ రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ పక్కా ఆధారాలతో నిందితుడిని 24 గంటల్లోపే అదుపులోకి తీసుకున్నారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని