Crime News: చేతికి బేడీ.. అయినా చోరీ.. ఠాణా నుంచి తప్పించుకొని మరో నేరం!

చేతికి బేడీతో ఓ నిందితుడు ఠాణా నుంచి తప్పించుకొన్నాడు.. గంటల వ్యవధిలోనే ఓ ద్విచక్ర వాహనాన్ని దొంగిలించి అమ్మకానికి పెట్టాడు.. జనం పోలీసులకు

Updated : 13 May 2022 06:47 IST

స్థానికుల అప్రమత్తతతో పట్టుబడ్డ దొంగ

నేలకొండపల్లి, కూసుమంచి, న్యూస్‌టుడే: చేతికి బేడీతో ఓ నిందితుడు ఠాణా నుంచి తప్పించుకొన్నాడు.. గంటల వ్యవధిలోనే ఓ ద్విచక్ర వాహనాన్ని దొంగిలించి అమ్మకానికి పెట్టాడు.. జనం పోలీసులకు నిందితుడిని అప్పగించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన కాశిబోయిన గణపతి ఇటీవల పలు ద్విచక్ర వాహనాల దొంగతనాలు చేశాడు. ఈ నేపథ్యంలో నేలకొండపల్లి పోలీసులు ఆయన్ను నాలుగు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. అక్కడి స్టేషన్‌ నుంచి బుధవారం అర్ధరాత్రి సమయంలో పరారయ్యాడు. కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో సర్పంచి కుమారుడి వివాహ సందర్భంగా గ్రామంలో రద్దీ ఉండటం గమనించాడు.  ఓ ద్విచక్ర వాహనాన్ని దొంగిలించాడు. అదే గ్రామంలో ఉర్లుగొండ వెళ్లే రహదారి వైపు తీసుకెళ్లి బేరం పెట్టాడు. తన వాహనం లేకపోవడంతో వివాహానికి వచ్చిన వ్యక్తి స్థానికంగా తెలిసిన వారందరికీ సమాచారం ఇచ్చారు. అందరూ అప్రమత్తం కావడంతో వాహనాన్ని విక్రయానికి పెట్టిన వ్యక్తి బండితో సహా పట్టుబడ్డాడు. విచారిస్తున్న క్రమంలో అతని చేతికి పోలీసు బేడీ కనిపించింది. ఆరా తీయగా అతను నేలకొండపల్లి ఠాణా నుంచి పరారైన నిందితుడని వెల్లడైంది. గ్రామస్థుల సమాచారం మేరకు అతన్ని అదుపులోకి తీసుకున్న కూసుమంచి పోలీసులు నేలకొండపల్లి స్టేషన్‌కు అప్పగించారు. రెండు నెలల క్రితం కూడా ఓ కేసులో నేలకొండపల్లి స్టేషన్‌కు తీసుకొచ్చిన ఓ నిందితుడు ఇలానే పారిపోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని