Telangana News: తలలో ఇనుప చువ్వతో 3 గంటలు నరకయాతన!

మోరీ నిర్మాణ పనుల్లో జారిపడిన నిర్మాణ కార్మికుడొకరు.. దవడ నుంచి తలపై వరకు ఇనుప చువ్వ చొచ్చుకుని.. మూడు గంటలపాటు నరకయాతన అనుభవించి..చివరకు చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 14 May 2022 08:41 IST

చికిత్స పొందుతూ నిర్మాణ కార్మికుడి మృతి
మోరీ పనులు చేస్తుండగా ప్రమాదం

హుజూరాబాద్‌ పట్టణం, న్యూస్‌టుడే : మోరీ నిర్మాణ పనుల్లో జారిపడిన నిర్మాణ కార్మికుడొకరు.. దవడ నుంచి తలపై వరకు ఇనుప చువ్వ చొచ్చుకుని.. మూడు గంటలపాటు నరకయాతన అనుభవించి..చివరకు చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ లోని ఆర్టీసీడిపో క్రాసింగ్‌ వద్ద మోరీ నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు. వాటికి నీటితో క్యూరింగ్‌ చేసేందుకు వచ్చిన స్థానిక బుడిగజంగాల కాలనీకి చెందిన మౌటం రాజు(36) శుక్రవారం ప్రమాదవశాత్తు ఇనుప చువ్వలపై పడ్డాడు. దీంతో ఓ చువ్వ అతని దవడనుంచి తలపైకి దూసుకువచ్చింది. అతని కేకలు విన్న స్థానికులు 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది రాజు తలకు కింది భాగంలో చువ్వను కోసి తొలగించారు. ఉదయం 8.30గంటల సమయంలో పడిపోగా సుమారు గంటకు పైబడి చువ్వను పట్టుకుని రాజు ఉండిపోవడం చూపరులను కన్నీరు పెట్టించింది. 9.30గంటల ప్రాంతంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం వరంగల్‌లోని ఎంజిఎం ఆసుపత్రికి 11.20గంటలకు తరలించారు. చికిత్స నిర్వహించి ఇనుప చువ్వను 11.35 గంటలకు తొలగించిన వెంటనే రాజు ప్రాణాలు విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని