Crime News: రాత్రి విధులు నిర్వహించి.. ఉదయానికి విగతజీవిగా పీజీ వైద్య విద్యార్థిని

నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్యకళాశాల ప్రసూతి విభాగంలో శ్వేత అనే పీజీ వైద్యవిద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. రాత్రి విధులు నిర్వహించి విశ్రాంతి తీసుకున్న ఆమె.. తెల్లవారేసరికి విగతజీవిగా మారారు. పోలీసులు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్‌ నగర శివారులోని తిమ్మాపూర్‌కు చెందిన గుర్రం శ్రీనివాస్‌, కవిత దంపతుల కుమార్తె శ్వేత (27) చెలిమెడ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. 2020లో పీజీలో చేరారు.

Updated : 14 May 2022 06:47 IST

నిజామాబాద్‌ వైద్యవిభాగం, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్యకళాశాల ప్రసూతి విభాగంలో శ్వేత అనే పీజీ వైద్యవిద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. రాత్రి విధులు నిర్వహించి విశ్రాంతి తీసుకున్న ఆమె.. తెల్లవారేసరికి విగతజీవిగా మారారు. పోలీసులు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్‌ నగర శివారులోని తిమ్మాపూర్‌కు చెందిన గుర్రం శ్రీనివాస్‌, కవిత దంపతుల కుమార్తె శ్వేత (27) చెలిమెడ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. 2020లో పీజీలో చేరారు. గురువారం రాత్రి 11.30 గంటలకు డ్యూటీ ముగియడంతో పక్కనే ఉన్న గదిలో విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లారు. ఆమెతో పాటు అక్కడ విశ్రాంతి తీసుకున్న కొందరు మహిళా హౌస్‌సర్జన్లు తెల్లవారుజామున మూడు గంటలకు వెళ్లిపోయారు. శస్త్రచికిత్సలు ఉండటంతో ఉదయం ఆరు గంటలకు శ్వేతను నిద్ర లేపేందుకు సిబ్బంది ప్రయత్నించగా.. ఆమె అచేతనంగా పడి ఉన్నారు. సమాచారం తెలిసి వైద్యులు, పోలీసులు, సూపరింటెండెంట్‌ అక్కడికి చేరుకున్నారు. శ్వేతకు గతంలో రెండుసార్లు కొవిడ్‌ వచ్చిందని, అందువల్లే గుండెపోటుతో మృతి చెంది ఉండవచ్చని సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌ చెప్పారు. శ్వేత తోటి వైద్యులందరికీ గురువారం సాయంత్రం సరదాగా టీ పార్టీ ఇచ్చారని, తన తల్లితో ఫోన్లో మాట్లాడారని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న తమ కుమార్తె ఎలా చనిపోయిందో సమాధానం చెప్పాలని కరీంనగర్‌ నుంచి వచ్చిన శ్వేత తల్లిదండ్రులు వైద్యులను నిలదీశారు. మృతి చెందిన కుమార్తెను చూసి వారు భోరున విలపించారు. ఝార్ఖండ్‌లో ఐపీఎస్‌ శిక్షణ పొందుతున్న శ్వేత సోదరుడు రవి వచ్చాక శవపరీక్ష చేశారు. ఆమె కుటుంబీకులు సీపీ నాగరాజును కలిసి శ్వేత మృతికి గల కారణాలు తెలుసుకోవాలని విన్నవించారు. శ్వేతకు పెళ్లిచూపులు పూర్తవడంతో త్వరలో నిశ్చితార్థం చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆమె తండ్రి శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటో ఠాణా ఎస్‌హెచ్‌వో విజయ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని