Hyderabad News: తల్లి మృతదేహంతో మూడు రోజులు ఇంట్లోనే!

కళ్లెదుట కన్నతల్లి అచేతనంగా పడి ఉంది.. మానసిక పరిస్థితి బాగాలేని ఆ 25 ఏళ్ల కొడుకు ఇదేం పట్టకుండా పక్క గదిలో తనలో తానే మాట్లాడుకుంటూ మూడు రోజులు గడిపాడు

Published : 15 May 2022 08:27 IST

మానసిక స్థితి కోల్పోయిన తనయుడు
మల్కాజిగిరిలో హృదయ విదారక ఘటన

ఈనాడు, హైదరాబాద్‌-మల్కాజిగిరి, న్యూస్‌టుడే: కళ్లెదుట కన్నతల్లి అచేతనంగా పడి ఉంది.. మానసిక పరిస్థితి బాగాలేని ఆ 25 ఏళ్ల కొడుకు ఇదేం పట్టకుండా పక్క గదిలో తనలో తానే మాట్లాడుకుంటూ మూడు రోజులు గడిపాడు. ఇంట్లోంచి దుర్వాసన వస్తోందని చుట్టుపక్కలవారు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో మల్కాజిగిరిలో ఈ హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. కాలనీవాసులు, మల్కాజిగిరి ఎస్సై యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా లింగంపల్లి గ్రామానికి చెందిన విప్పల రామ్మోహన్‌, విజయరాణి(50) భార్యాభర్తలు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేసే రామ్మోహన్‌ 2015లో అనారోగ్యంతో మరణించారు. ఆయన మృతి చెందాక బెంగళూరు నుంచి వచ్చిన విజయరాణి తన కొడుకుతో కలిసి మల్కాజిగిరి పట్టణం విమలాదేవినగర్‌లోని మైత్రినివాస్‌ అపార్ట్‌మెంట్‌ సొంత ఫ్లాట్‌లో ఉంటోంది. ఇదిలా ఉండగా.. బీటెక్‌ పూర్తి చేసిన వెంకటసాయి తండ్రి మరణించడంతో మానసికంగా కుంగిపోయాడు. స్నేహితులు, బంధువులకు దూరమై ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నాడు. తల్లితో తరచూ గొడవకు దిగుతూ పెద్దగా అరిచేవాడు. అతని అరుపులతో ఇబ్బంది పడుతున్నామంటూ స్థానికులు కొన్ని నెలల క్రితం కాలనీ సంఘానికి ఫిర్యాదు చేశారు. కుమారుడిపై ఫిర్యాదు చేశారనే ఉద్దేశంతో తల్లి సైతం ఇరుగుపొరుగు వారితో మాట్లాడటం లేదు. ఈ క్రమంలో వారి ఇంట్లోంచి దుర్వాసన వస్తుండటంతో పక్క ఫ్లాట్‌ యజమాని తలుపులు కొట్టి పిలిచినా తల్లీకొడుకులు పలకలేదు. దీంతో శుక్రవారం రాత్రి మల్కాజిగిరి పోలీసులకు సమాచారమివ్వగా.. వారు బలవంతంగా తలుపులు తెరిచి ఫ్లాట్‌లోపలికి ప్రవేశించారు. అందులోని ఓ గదిలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న విజయరాణి మృతదేహాన్ని గుర్తించారు. మరో గదిలో వెంకటసాయి తనలో తాను మాట్లాడుకుంటూ, బిత్తరచూపులు చూస్తున్నాడు. పోలీసులు విజయరాణి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి వెంకటసాయిని అదుపులోకి తీసుకున్నారు. శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని శనివారం కుటుంబసభ్యులకు అప్పగించారు. విజయరాణి మూడ్రోజుల క్రితమే మరణించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆమె తలకు గాయమైనట్లు గుర్తించారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మృతికి కారణం తెలుస్తుందని ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని