Andhra News: కణితిని తీయించుకునేందుకు వస్తే.. ప్రాణాలు పోయాయి

గుంటూరు సర్వజనాసుపత్రిలో కంటి కింద కణితిని తొలగించే క్రమంలో అపస్మారక స్థితికి వెళ్లిన చిన్నారి ఆరాధ్య శనివారం కన్నుమూసింది. ఆమె తల్లిదండ్రుల రోదన మిన్నంటింది.

Updated : 15 May 2022 10:04 IST

జీజీహెచ్‌ వైద్యుల నిర్లక్ష్యంపై విమర్శలు

ఈనాడు, అమరావతి: గుంటూరు సర్వజనాసుపత్రిలో కంటి కింద కణితిని తొలగించే క్రమంలో అపస్మారక స్థితికి వెళ్లిన చిన్నారి ఆరాధ్య శనివారం కన్నుమూసింది. ఆమె తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. అంత బాధలోనూ వారు తమ కుమార్తె కళ్లను దానం చేశారు. గుంటూరు నగర శివారు అంకిరెడ్డిపాలేనికి చెందిన ఏడుకొండలు, మోహన పావని దంపతులు. వీరి కుమార్తె ఆరాధ్య (5) కంటి కింది భాగంలో చిన్న కణితి ఏర్పడింది. చికిత్స కోసం తల్లిదండ్రులు ఆమెను ఈ నెల 7న జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. వైద్యులు ఆసుపత్రిలో చేర్చుకుని చిన్న శస్త్రచికిత్స చేశారు. తర్వాత కొంత సేపటికే బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. రెండు రోజులైనా స్పృహలోకి రాలేదు. వైద్యుల నిర్లక్ష్యంవల్లే తమ పాప పరిస్థితి విషమంగా మారిందని, పది నిమిషాల్లో శస్త్ర చికిత్స పూర్తి చేసి అదేరోజు ఇంటికి పంపిస్తామని చెప్పి... రెండు రోజులు గడిచినా ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వడం లేదని బాలిక తల్లిదండ్రులు గుంటూరు కలెక్టర్‌కు రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. మెరుగైన వైద్యం కోసం ఆరాధ్యను ఈ నెల 9న రమేశ్‌ ఆసుపత్రికి తరలించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అక్కడ 6 రోజులు వెంటిలేటర్‌పై ఉంచి చేసిన ప్రయత్నమూ ఫలించలేదు. ఈ ఉదంతంపై ఇప్పటికే ప్రభుత్వం ముగ్గురు వైద్యులతో విచారణ జరిపించి నివేదిక తెప్పించుకుంది. వైద్య సేవలు అందించటంలో జీజీహెచ్‌ వైద్యుల సమన్వయలోపం, నిర్లక్ష్యాలే చిన్నారి మృతికి కారణమని నివేదిక పేర్కొన్నట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని