Published : 17 May 2022 07:26 IST

Andhra News: అక్రమ మట్టి తవ్వకాల ఫలితం.. నాలుగు ప్రాణాలు బలి

నీటికుంటలో ఎడ్ల బండి బోల్తా
తండ్రీకుమారుడు సహా ఎడ్లు మృతి

మాచవరం, న్యూస్‌టుడే: మట్టి అక్రమ తవ్వకాలు నాలుగు ప్రాణాలను బలిగొన్నాయి. నీటికుంటలో ఎడ్లబండి బోల్తాపడి తండ్రీకుమారుడు సహా ఎడ్లు మృతి చెందిన హృదయ విదారక ఘటన పల్నాడు జిల్లా మాచవరం మండలం గంగిరెడ్డిపాలెంలో చోటుచేసుకుంది. దీంతో సాగును నమ్ముకుని జీవిస్తున్న ఆ సన్నకారు రైతు కుటుంబం వీధిన పడింది. గ్రామానికి చెందిన మధిర నాగరాజుకు (35) భార్య అనూరాధ, కుమార్తె లక్ష్మీభవాని, కుమారుడు వెంకట చరణ్‌ (8), తల్లిదండ్రులు ఉన్నారు. వారి కుటుంబానికి 5 ఎకరాల పొలమున్నా... పంపకాలు కాలేదు. దీంతో నాగరాజు 9 ఎకరాల పొలం కౌలుకు తీసుకున్నారు. అందులోని మూడెకరాల్లో వేసిన మిర్చి దెబ్బతినడంతో మళ్లీ మొక్కజొన్న సాగు చేశారు. సోమవారం మొక్కజొన్న కండెలను ఒక విడత ఎడ్లబండిపై వేసుకుని ఊరి శివారులోని కల్లంలో ఆరబోశారు. రెండో విడత కండెలు తీసుకొచ్చేందుకు వెళ్తుండగా ఎడ్లు నీటి కోసం రోడ్డుపక్కన ఉన్న రాముల కుంటలోకి దిగాయి. అందులోని లోతైన గోతుల్లో ఎడ్లు పడిపోయి, ఎడ్లబండి బోల్తా పడింది. దాన్ని తోలుతున్న నాగరాజు, ఆయన పక్కనే కూర్చున్న కుమారుడు వెంకట చరణ్‌ నీటి అడుగు భాగంలో బండికింద ఇరుక్కుపోయారు. ఊపిరాడక వారిద్దరూ ప్రాణాలు విడిచారు. ఎడ్లూ మృత్యువాత పడ్డాయి. ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో దారుణ ఘటనను గుర్తించలేదు. కొద్దిసేపటి తర్వాత ఎడ్లు నీటిపై తేలుతూ ఉండటాన్ని చూసిన స్థానికులు కేకలు వేశారు. గ్రామస్థులు హుటాహుటిన వచ్చి ఎడ్లను పొక్లెయిన్‌తో బయటకు తీశారు. నీటి అడుగున ఉన్న బండిని లాగగా తండ్రీకుమారుల మృతదేహాలు వెలుగు చూశాయి. బాధిత కుటుంబ సభ్యులను గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు (తెదేపా) పరామర్శించారు. అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కుంటలో కొందరు మట్టిని ఇష్టారీతిగా తవ్వడంతోనే గోతులు ఏర్పడ్డాయని, వాటి కారణంగానే ఇప్పుడు రైతు కుటుంబం అనాథగా మారిందని కొందరు స్థానికులు మండిపడ్డారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని