ఒంటిపై పెట్రోలు పోసుకున్న యువమోర్చా నాయకుడు

తమ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారంటూ భాజపా యువమోర్చా (బీజేవైఎం) కార్యకర్త ఒకరు ఒంటిపై పెట్రోలు పోసుకున్నారు. అదే సమయంలో అక్కడ

Published : 18 May 2022 05:36 IST

ప్రమాదవశాత్తు అంటుకుని స్వల్పగాయాలు

ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: తమ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారంటూ భాజపా యువమోర్చా (బీజేవైఎం) కార్యకర్త ఒకరు ఒంటిపై పెట్రోలు పోసుకున్నారు. అదే సమయంలో అక్కడ దిష్టిబొమ్మ దహనం అవుతున్న మంటలు అంటుకోవడంతో అతని చేతికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం ఖమ్మంలో చోటుచేసుకుంది. తెరాస నాయకులు సోమవారం ఖమ్మంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. దీనికి ప్రతిగా భాజపా జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం సీఎం కేసీఆర్‌, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ల దిష్టిబొమ్మలు దహనం చేసేందుకు జడ్పీ సెంటర్‌లో సిద్ధమయ్యారు. ఈ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు తెరాస కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారంటూ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అనంతు ఉపేందర్‌గౌడ్‌ ఒంటిపై పెట్రోలు పోసుకున్నారు. అదే సమయంలో పక్కనే దిష్టిబొమ్మ దహనం అవుతున్న మంటలు ప్రమాదవశాత్తు స్వల్పంగా అతని చేతికి అంటుకోవటంతో బొబ్బలు వచ్చాయి. వెంటనే అక్కడున్న పార్టీ కార్యకర్తలు, పోలీసులు ఉపేందర్‌గౌడ్‌పై నీళ్లు పోసి ప్రమాదాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నిరసన కార్యక్రమంలో కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, భాజపా నాయకులు ప్రదీప్‌, రవి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని