Crime News: ఆదిలాబాద్‌కు కర్నాల్‌ ఉగ్ర నిందితులు!

ఆయుధాల అక్రమ రవాణా వ్యవహారంలో పంజాబ్‌ పోలీసులకు చిక్కిన ఉగ్ర అనుమానితుల్ని తెలంగాణకు తీసుకురానున్నారు. పంజాబ్‌లోని కర్నాల్‌లో అక్కడి పోలీసులు ఈ నెల 5న నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Published : 19 May 2022 08:47 IST

 ఆయుధాల తరలింపు లింకులపై ఆరా తీయనున్న పోలీసులు

ఆరు నెలల్లో రూ.22 లక్షల హవాలా సొమ్ము అందినట్లు వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఆయుధాల అక్రమ రవాణా వ్యవహారంలో పంజాబ్‌ పోలీసులకు చిక్కిన ఉగ్ర అనుమానితుల్ని తెలంగాణకు తీసుకురానున్నారు. పంజాబ్‌లోని కర్నాల్‌లో అక్కడి పోలీసులు ఈ నెల 5న నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వారికి పాకిస్థాన్‌లో ఉంటూ ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది రింధాతో సంబంధమున్నట్లు విచారణలో తేలింది. వారిలో భూపేంద్రసింగ్‌, పర్మేందర్‌సింగ్‌లను విచారణ అనంతరం తిరిగి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు అమన్‌దీప్‌ సింగ్‌, గురుప్రీత్‌ సింగ్‌లను న్యాయస్థానం అనుమతితో ఆదిలాబాద్‌కు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పంజాబ్‌ నుంచి ఆయుధసామగ్రిని ఆదిలాబాద్‌కు తరలించే క్రమంలోనే వీరు చిక్కిన నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకొంది. వారిని ఆదిలాబాద్‌ తీసుకొచ్చి ఎక్కడ ఆయుధాల్ని అప్పగించాలనుకున్నారన్న విషయంపై ఆరా తీయనున్నారు. వాస్తవానికి ఆయుధాల్ని ఆదిలాబాద్‌లో ఎవరికి అప్పగించాలనే విషయం నలుగురు నిందితులకు సైతం తెలియదని పోలీసులు భావిస్తున్నారు. పాకిస్థాన్‌ నుంచి రింధా కేవలం ఆదిలాబాద్‌ లొకేషన్‌ను మాత్రమే వాట్సప్‌ ద్వారా షేర్‌ చేశాడని దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలోనే ఆధారాలేమైనా దొరుకుతాయా అనే ఉద్దేశంతో అక్కడికి నిందితులిద్దరినీ తీసుకురానున్నారు. ఇప్పటివరకు జరిపిన విచారణలో సేకరించిన సమాచారం మేరకు గత ఆరు నెలలుగా కర్నాల్‌ నిందితులకు సుమారు రూ.22 లక్షల హవాలా సొమ్ము అందినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని