Hyderabad: శిల్ప కళావేదికలో అపశ్రుతి.. ప్రమాదవశాత్తూ ఐబీ అధికారి మృతి

మాదాపూర్‌ శిల్పకళావేదికలో అపశ్రుతి దొర్లింది. అక్కడ భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణకు వచ్చిన ఐబీ (ఇంటెలిజెన్స్‌ బ్యూరో) అధికారి వేదిక ముందున్న మెయింటెనెన్స్‌ ఏరియాలో పడి మృతి చెందారు. మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.రవీంద్ర ప్రసాద్‌

Published : 19 May 2022 06:43 IST

 

మాదాపూర్‌, న్యూస్‌టుడే: మాదాపూర్‌ శిల్పకళావేదికలో అపశ్రుతి దొర్లింది. అక్కడ భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణకు వచ్చిన ఐబీ (ఇంటెలిజెన్స్‌ బ్యూరో) అధికారి వేదిక ముందున్న మెయింటెనెన్స్‌ ఏరియాలో పడి మృతి చెందారు. మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.రవీంద్ర ప్రసాద్‌ కథనం ప్రకారం.. బిహార్‌ రాజధాని పట్నాకు చెందిన కుమార్‌ అమిరేష్‌ (51) కోఠిలోని ఐబీ కార్యాలయంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. జూబ్లీహిల్స్‌ ఐబీ క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు. ఈ నెల 20న శిల్పకళా వేదికలో సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా ఆయన సాహిత్యంపై పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానికి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్న సమయంలో ఐబీ, ఐఎస్‌డబ్ల్యూ(ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌) అధికారులు వచ్చి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ క్రమంలో అమిరేష్‌ వేదికపై నిలబడి ఆడిటోరియం ఫొటోలు తీసుకుంటూ చివరకు వచ్చి కాలుజారి వేదిక ముందుండే మెయింటెనెన్స్‌ ఏరియా (పది అడుగులకు పైగా గుంతలా ఉండే ప్రాంతం)లో పడిపోయారు. తలకు తీవ్రగాయాలు కావడంతో ఆయనను వెంటనే తోటి అధికారులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన రాత్రి ఏడు గంటలకు ప్రాణాలు కోల్పోయారు. అమిరేష్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని