Andhra News: వైకాపా నేత స్థలం లాక్కున్నారని.. వేదనతో వృద్ధురాలి మృతి

తన ఇంటి స్థలాన్ని గ్రామానికి చెందిన, స్థానిక ప్రజాప్రతినిధి అయిన ఓ వైకాపా నాయకుడు లాక్కున్నారనే మనోవేదనతో చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని జంగాలపల్లికి చెందిన సుందరమ్మ (75) బుధవారం మరణించారు.

Updated : 19 May 2022 08:35 IST

యాదమరి, న్యూస్‌టుడే: తన ఇంటి స్థలాన్ని గ్రామానికి చెందిన, స్థానిక ప్రజాప్రతినిధి అయిన ఓ వైకాపా నాయకుడు లాక్కున్నారనే మనోవేదనతో చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని జంగాలపల్లికి చెందిన సుందరమ్మ (75) బుధవారం మరణించారు. ఆమె కుమారుడు వేణు కథనం మేరకు.. గత కొద్దికాలంగా సుందరమ్మకు చెందిన ఇంటి స్థలం విషయంలో వివాదం నడుస్తోంది. ఆమె భర్త కన్నయ్య విశ్రాంత విద్యుత్‌శాఖ ఉద్యోగి. ఆయన కొద్దికాలం క్రితం మరణించారు. 2006లో ఆయన జంగాలపల్లిలో స్థలం కొని ఇల్లు కట్టించారు. అధికార పార్టీ నాయకుడొకరు ఆ స్థలం తనదంటూ గత నెల 29న బలవంతగా ఇల్లు ఖాళీ చేయించి ఇంట్లోని వస్తువులను వేరే వాహనంలో తరలించి బండివాళ్ల ఊరు వద్ద పడవేశారు. దీనిపై బాధితులు యాదమరి పోలీసుస్టేషన్‌లో అప్పట్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. తమకు న్యాయం జరగలేదన్న వేదనతో సుందరమ్మ సరిగా ఆహారం తీసుకునేవారు కారు. ఇంటి స్థలం పోయిందన్న బాధతోనే మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారని.. ఆసుపత్రికి తరలించగా ఆక్కడ మరణించారని కుమారుడు వేణు తెలిపారు. ఈ విషయమై ఎస్సై ప్రతాప్‌రెడ్డిని వివరణ కోరగా, స్థల వివాదం, గొడవలపై ఇదివరకే కేసు నమోదైందని, అయితే సుందరమ్మది సహజ మరణమేనని చెప్పారు. ప్రస్తుతం ఆమె మరణంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని