Crime News: నకిలీ పట్టాలు.. ఏటా రూ.20 కోట్లు!

చదవకపోయినా రూ.లక్షలు పుచ్చుకొని ఇంజినీరింగ్‌, డిగ్రీలు పూర్తి చేశారంటూ పట్టాలు ఇస్తున్న భోపాల్‌లోని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విశ్వవిద్యాలయంలో అక్రమాలు తవ్వే కొద్దీ వెలుగు చూస్తున్నాయి. వర్సిటీ ఉపకులపతులు ఏటా

Updated : 21 May 2022 07:28 IST

ఎస్‌ఆర్‌కే విశ్వవిద్యాలయం ఉపకులపతుల లక్ష్యం ఇది

ఈనాడు, హైదరాబాద్‌: చదవకపోయినా రూ.లక్షలు పుచ్చుకొని ఇంజినీరింగ్‌, డిగ్రీలు పూర్తి చేశారంటూ పట్టాలు ఇస్తున్న భోపాల్‌లోని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విశ్వవిద్యాలయంలో అక్రమాలు తవ్వే కొద్దీ వెలుగు చూస్తున్నాయి. వర్సిటీ ఉపకులపతులు ఏటా వెయ్యిమందికి నకిలీ పట్టాలు ఇచ్చి రూ.20 కోట్లు అక్రమంగా సంపాదించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. దీన్ని మాజీ ఉపకులపతి కుష్వా నాలుగేళ్ల క్రితం ప్రారంభించగా ప్రస్తుత వీసీ ప్రశాంత్‌ పిళ్లై, కొనసాగిస్తున్నారు. మరోవైపు ఎస్‌ఆర్‌కే వర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌ పట్టాలు తీసుకున్న కొందరు విద్యార్థులు అమెరికాలో ఉన్నారంటూ పోలీసులు తెలపడంతో దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. ఎస్‌ఆర్‌కే వర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌, డిగ్రీ పట్టాలు తీసుకున్న విద్యార్థుల్లో అమెరికాకు ఎంతమంది వెళ్లారు.. వారి విద్యార్హత పత్రాలు సక్రమంగా ఉన్నాయా? లేదా? అన్న అంశాలను నిర్ధారించుకునేందుకు విద్యార్థుల జాబితాను అధికారులు సేకరిస్తున్నారు. వర్సిటీలోని అక్రమాల వివరాలను తెలుసుకునేందుకు వీసీ ప్రశాంత్‌ పిళ్లై, మాజీ వీసీ కుష్వాలను తమకు అప్పగించాలంటూ సీసీఎస్‌ పోలీసులు కోర్టును అభ్యర్థించారు.

ఉపకులపతుల కనుసన్నల్లోనే..

డిగ్రీకి రూ.2 లక్షలు, ఎంబీఏకు రూ.2.50 లక్షలు, ఇంజినీరింగ్‌కు రూ.4 లక్షలు వసూలు చేస్తూ నకిలీ పట్టాలు ఇస్తున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, ముంబయి, చెన్నై, దిల్లీలోని కన్సల్టెంట్ల నిర్వాహకులు 30 నుంచి 40 శాతం కమీషన్‌ తీసుకుని పట్టాలు అవసరమైన వారిని తీసుకొచ్చేవారు. ఆ తర్వాత వ్యవహారమంతా ఎస్‌ఆర్‌కే వర్సిటీ వీసీగా బాధ్యతలు నిర్వర్తించిన ఎస్‌.ఎస్‌.కుష్వా చూసుకునేవాడు. అతడు గతేడాది పదవీవిరమణ చేశాక బాధ్యతలు చేపట్టిన ప్రశాంత్‌ పిళై నకిలీ పట్టాలు మరింత మందికి ఇవ్వాలంటూ లక్ష్యాలను నిర్దేశించినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. గత మూడు నెలల్లో ఎస్‌ఆర్‌కే వర్సిటీ నుంచి 44 మంది అక్రమంగా పట్టాలు తీసుకున్నవారు పట్టుబడితే వారిలో 19 మంది హైదరాబాద్‌, ఇతర జిల్లాల్లో ఉన్నారని అదనపు సీపీ(నేర పరిశోధన) ఎ.ఆర్‌.శ్రీనివాస్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని