Published : 21 May 2022 07:53 IST

Crime News: రూ.100, రూ.200 కోసం గొడవలు.. రెండు నిండుప్రాణాలు బలి

కేవలం వంద, రెండొందల కోసం గుంటూరు జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు గొడవల్లో రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. రూ.100ల కోసం ఓ వాహన డ్రైవర్‌ మహిళను పొట్టనపెట్టుకుంటే.. రూ.200 ఇవ్వలేదని ఓ యువకుడు సాటి వ్యక్తిని హతమార్చాడు. ఈ రెండు అమానవీయ ఘటనలు.. నలుగురు చిన్నారులను అనాథలు చేసి, దివ్యాంగురాలైన ఓ తల్లికి కడుపుకోత మిగిల్చాయి.


ప్రాణం తీసిన రూ.100 గొడవ

గుంటూరు(లాడ్జిసెంటర్‌), న్యూస్‌టుడే : గుంటూరు నగర శివారులో ఛార్జీ డబ్బులు రూ.100 కోసం జరిగిన తగవులో మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె నలుగురు పిల్లలు అనాథలుగా మారారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన రమణకు నలుగురు పిల్లలు. భర్త కోటేశ్వరరావు కొన్నాళ్ల క్రితం మరణించాడు. శుక్రవారం ఆమె ఇద్దరు పిల్లలు, మరో ముగ్గురు బంధువులతో కలిసి చిలకలూరిపేట నుంచి గుంటూరు శివారులోని నాయుడుపేటకు వెళ్లడానికి కంటెయినర్‌ లారీ ఎక్కింది. నాయుడుపేట వద్ద దిగి డ్రైవర్‌కు ఛార్జీ డబ్బుల కింద రూ.100 ఇచ్చింది. అయితే డ్రైవర్‌ రూ.300 ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. తమ వద్ద లేవని మరో రూ.100 ఇచ్చింది. దీంతో డ్రైవర్‌ వారి సెల్‌ఫోన్‌ను లాక్కున్నాడు. ఫోన్‌ ఇవ్వాలని రమణ తమ్ముడి కుమార్తె కంటెయినర్‌ ఎక్కి డ్రైవర్‌ను అభ్యర్థిస్తుండగా.. అతను వాహనాన్ని ముందుకు కదిలించాడు. దీంతో మేనకోడలు ప్రమాదంలో ఉందని బాధితురాలు కంటెయినర్‌ను పట్టుకుంది. ఆమె వేలాడుతుండగానే వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. కొంతదూరం వెళ్లాక ఆమె పట్టు తప్పి చక్రాల కింద పడి మృతి చెందింది. కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఏటుకూరు బైపాస్‌ వద్ద వాహనాన్ని వదిలి పారిపోయాడు. వాహనం పశ్చిమబెంగాల్‌కు చెందినదిగా గుర్తించారు. తల్లి మృతితో అనాథలుగా మారిన పిల్లల్ని ఆదుకోవాలని స్థానిక నాయకులు డిమాండ్‌ చేశారు.


ఆర్థిక లావాదేవీలతో వాలంటీరు మృతి

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా తెనాలిలోని ఆర్‌ఆర్‌నగర్‌లో రూ.200 కోసం జరిగిన గొడవలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ సీఐ యు.శ్రీనివాసులు వివరాల ప్రకారం... పట్టణంలో వార్డు వాలంటీరుగా పనిచేస్తున్న తాడిబోయిన సందీప్‌(23) తన మిత్రుడైన జశ్వంత్‌ ద్వారా తమ ప్రాంతానికే చెందిన రోహిత్‌కు గతవారం రూ.2 వేలు అప్పు ఇచ్చాడు. రోజుకు రూ.200 చెల్లించాలన్నది ఒప్పందం. రోహిత్‌ వరసగా 5 రోజులు డబ్బు చెల్లించి.. ఆరో రోజు మాత్రం నగదు జశ్వంత్‌కు ఇచ్చి, సందీప్‌కు ఇవ్వమన్నాడు. కానీ, జశ్వంత్‌ ఇవ్వలేదు. దీంతో గురువారం రాత్రి 11గంటలకు రోహిత్‌ ఇంటి వద్దకు వచ్చిన సందీప్‌ బకాయి గురించి అడిగాడు. తాను జశ్వంత్‌కు ఇచ్చానని రోహిత్‌ చెప్పడం, అది అందలేదని సందీప్‌ చెప్పే క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రోహిత్‌.. సందీప్‌ను బలంగా నెట్టివేయడంతో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వైద్యశాలకు తీసుకెళ్లగా.. గుండె ఆగినందున సందీప్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాధితుడి బంధువుల ఫిర్యాదు మేరకు రోహిత్‌, గొడవలో కలుగజేసుకున్న అతని తండ్రి వెంకటేశ్వర్లపై కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. సందీప్‌ తండ్రి చిన్నప్పుడే మృతిచెందగా, దివ్యాంగురాలైన ఆయన తల్లి తాడేపల్లిలో బంధువుల ఇంట్లో ఉంటోంది. ఆయన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ వాలంటీరుగా పని చేస్తూ, డబ్బును వడ్డీలకు ఇస్తుంటారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని