Published : 23 May 2022 04:35 IST

విషవాయువుతో ఆయువు తీసుకున్నారు!

ఇంటి నిండా నింపి.. తల్లీ, ఇద్దరు కుమార్తెల బలవన్మరణం

దిల్లీ: తమ ఇంటిని పూర్తిగా విషవాయువుతో నింపేసుకుని.. ఓ తల్లి, ఆమె ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు తీసుకున్నారు. నైరుతి దిల్లీలోని వసంత్‌ విహార్‌ ప్రాంతంలో ఈ దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి ఓ అపార్టుమెంట్‌లోని ఫ్లాట్‌లో నివసిస్తున్న ముగ్గురూ శనివారం రాత్రి లోపల తలుపులన్నీ వేసుకొని.. ఎంతకూ స్పందించక పోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా లోపల పడక గదిలో ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. మృతులను 50 ఏళ్లు పైబడిన మంజు శ్రీవాస్తవ, ఆమె కుమార్తెలు అన్షిక, అంకూలుగా గుర్తించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. విష వాయువుతో ఊపిరి ఆడక ముగ్గురూ చనిపోయినట్లు తేలింది. లోపలి గాలి బయటకు పోకుండా ఇంటిని దాదాపుగా గ్యాస్‌ ఛాంబర్‌లా మార్చేశారు. తలుపులు, కిటికీలు వేసేసి.. ఖాళీల్లేకుండా పాలిథిన్‌తో మూసివేసి, టేపులు వేశారు. ఇంటి బయట వెంటిలేటర్లను కూడా పూర్తిగా కప్పివేశారు. ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఆన్‌చేసి ఉండటంతో పాటు, ఓ చోట కుంపటి కూడా ఉంది. ఆ ఇంట్లో కొన్ని సూసైడ్‌ నోట్లను కూడా గుర్తించారు. భయం గొలిపే రీతిలో ఓ నోట్‌ ఉంది. ‘‘హెచ్చరిక : ఇల్లంతా చాలా ప్రమాదకర విష వాయువుతో నిండి ఉంది. లోపలికి వచ్చిన వారు అగ్గిపుల్లలు లేదా లైటర్లు వంటివి వెలిగించొద్దు. కిటికీలు తెరిచి, ఫ్యాను వేసి గాలి బయటకు వెళ్లిపోయేలా చూడండి’’ అని ఆ నోట్‌లో రాసి ఉంది. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మంజు భర్త ఉమేశ్‌ చంద్ర శ్రీవాస్తవ గత ఏడాది కొవిడ్‌తో మృతి చెందగా.. అప్పటి నుంచి ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. మంజు ఆరోగ్యం కూడా సరిగా లేక మంచానికే పరిమితమైపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని