యువకులపై ఎస్సై దాష్టీకం

జాతరలో అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్నారంటూ నలుగురు యువకులను కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎస్సై జి.సురేంద్ర తన స్టేషన్‌లో లాఠీలతో చితకబాదారు. పప్పులవారిపాలేనికి

Published : 23 May 2022 04:35 IST

జాతరలో అశ్లీల నృత్యాలు నిర్వహించారంటూ స్టేషన్‌లో చితకబాదిన వైనం

పి.గన్నవరం, న్యూస్‌టుడే: జాతరలో అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్నారంటూ నలుగురు యువకులను కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎస్సై జి.సురేంద్ర తన స్టేషన్‌లో లాఠీలతో చితకబాదారు. పప్పులవారిపాలేనికి చెందిన క్షతగాత్రులను అమలాపురం ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. సంఘటన జరిగాక రెండు రోజులకు సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్‌ కావడంతో కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు స్పందించారు. క్షతగాత్రులను పరామర్శించారు. బాధ్యుడైన ఎస్సై సురేంద్రను సస్పెండ్‌ చేయాలని డిమాండు చేయడంతో కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై జి.సురేంద్రను వీఆర్‌లోకి పంపారు. పి.గన్నవరం ఇన్‌ఛార్జి ఎస్సైగా పి.గంగాభవానిని నియమించారు. అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డిని విచారణాధికారిగా నియమించారు.

ఆరోజు రాత్రి ఏం జరిగిందంటే..
పప్పులవారిపాలెంలో 18న రాత్రి అమ్మవారి జాతర సందర్భంగా అశ్లీల నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని ఎస్సై సురేంద్రకు సమాచారం అందింది. ఆయన వెళ్లి పప్పుల వెంకట సత్యదుర్గాప్రసాద్‌, పప్పుల శ్రీనుబాబు, పప్పుల ప్రసాద్‌, పప్పుల నవీన్‌లను పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. తమను కులం పేరుతో దూషిస్తూ లాఠీతో ఎస్సై కొట్టారని, అది విరిగినప్పటికీ ఆపలేదని సత్యదుర్గాప్రసాద్‌ వాపోయారు. కముకు దెబ్బలతో ఒళ్లంతా తట్టు కింద లేచిందని రోదించారు. దెబ్బలకు తాళలేక స్పృహ తప్పి పడిపోయానని శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కనికరం చూపకుండా కొట్టారన్నారు. తనను ఎస్సై దుర్భాషలాడారని, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని నవీన్‌ వివరించారు. లాఠీతో ఎక్కడపడితే అక్కడ కొట్టారని, ఎవరికీ చెప్పొద్దంటూ ఎస్సై బెదిరించారని మరో క్షతగాత్రుడు ప్రసాద్‌ తెలిపారు. 19వ తేదీ రాత్రి వరకు స్టేషన్‌లోనే ఉంచి ప్రైవేటు వైద్యుడితో చికిత్స చేయించి పంపించారన్నారు. జాతరలో అశ్లీల నృత్య ప్రదర్శనలు చేయడంతో 20 మంది నిర్వాహకులను అరెస్టు చేసి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపినట్లు ఎస్సై జి.సురేంద్ర చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని