తెదేపా మహిళా నేత, కార్యకర్తపై వైకాపా దాడి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో తెదేపా మహిళా నాయకురాలు, మరో కార్యకర్తపై వైకాపా నేతలు దాడికి పాల్పడ్డారు. తెదేపా

Published : 23 May 2022 04:35 IST

నెల్లూరు (ఇరిగేషన్‌), దగదర్తి, న్యూస్‌టుడే: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో తెదేపా మహిళా నాయకురాలు, మరో కార్యకర్తపై వైకాపా నేతలు దాడికి పాల్పడ్డారు. తెదేపా నెల్లూరు నగర మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి తన భర్త శ్రీనివాసులు స్టేషన్‌లో ఉన్నారన్న సమాచారంతో ఆదివారం అక్కడికి వెళ్తుండగా వైకాపాకు చెందిన ఇద్దరు మహిళా కార్యకర్తలు అడ్డగించి దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ను విమర్శించినందుకే తనపై దాడి చేసి.. చంపుతామంటూ పోలీసుస్టేషన్‌ ఎదుటే కత్తులతో బెదిరించారని ఆరోపించారు. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రేవతిని తెదేపా నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మహిళా నేతలు పరామర్శించారు. ఈ దాడికి నిరసనగా తెదేపా నాయకులు సంతపేట పోలీసు స్టేషన్‌కు ఎదుట నిరసన తెలిపారు. మాజీ మంత్రి అనిల్‌కుమార్‌పై కేసు నమోదు చేయాలని కోటంరెడ్డి డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న తెదేపా  ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత ఫోన్‌ చేసి రేవతిని పరామర్శించారు. అలాగే దగదర్తి మండలం తురిమెర్లకు చెందిన తెదేపా కార్యకర్త చిన్నబ్బయ్యపై వైకాపా ఎంపీటీసీ సభ్యుడు సురేంద్ర, గ్రామ వాలంటీరు మనోహర్‌, మరొకరు కలిసి దాడి చేశారు. చిన్నబ్బయ్యకు, సురేంద్రకు మధ్య కొన్నాళ్లుగా వివాదాలున్నాయి. గ్రామ పెద్దల సమక్షంలో రాజీ జరిగినా అతనిపై కక్ష పెంచుకున్న సురేంద్ర శనివారం రాత్రి గ్రామ వాలంటీరు మనోహర్‌, మధు అనే వ్యక్తితో కలిసి చిన్నబ్బయ్య వివాదానికి దిగి ఇనుప రాడ్లతో దాడి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని