Updated : 24 May 2022 10:18 IST

Crime News: మహిళలు పాత్రధారులుగా గంజాయి రవాణా

హయత్‌నగర్‌ పోలీసుల నిఘాతో బండారం బట్టబయలు
10 మంది నిందితుల అరెస్ట్‌.. 470 కిలోల మాదకద్రవ్యం స్వాధీనం

ఈనాడు, హైదరాబాద్‌ నేరెడ్‌మెట్‌, న్యూస్‌టుడే: మహిళలను వెంటబెట్టుకుని గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలోని 10 మంది నిందితులను హయత్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 470 కిలోల గంజాయి, 4 కార్లు, రూ.2లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో అదనపు సీపీ జి.సుధీర్‌బాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన నాయికం రాహుల్‌(24)కు ఏజెన్సీలో గంజాయి సాగుదారులతో పరిచయాలున్నాయి. యాదాద్రి జిల్లా బొల్లెపల్లికి చెందిన చెరుకుపల్లి శ్రీకాంత్‌(21) అలియాస్‌ కన్నయ్య డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. చోరీ కేసులో జైలుకెళ్లినపుడు రాహుల్‌ పరిచయమయ్యాడు. జైలు నుంచి విడుదలయ్యాక ఇద్దరూ కలసి ఇటీవల ఏపీలోని డొంకరాయి నుంచి 100 కిలోల గంజాయిని తీసుకెళ్లి జహీరాబాద్‌లో అందజేశారు. భారీగా డబ్బు చేతికందటంతో ఈసారి పెద్దఎత్తున సరకు సరఫరాకు ఏర్పాట్లు చేసుకున్నారు.

ఆడవాళ్లనే సెంటిమెంట్‌

వాహనాల్లో మహిళలుంటే పోలీసులు సానుభూతితో వదిలేయటం గమనించిన నిందితులు దానిని తమకు అనువుగా మలచుకున్నారు. మేడ్చల్‌ జిల్లాకు చెందిన జె.రవళి(20), డి.సంగీత(20)లకు రూ.20వేలు వంతున ఇస్తామంటూ ఆశజూపి, గంజాయి రవాణాకు ఎస్కార్టుగా తీసుకెళ్లారు. ఈనెల 22న శ్రీకాంత్‌, సాయినాథ్‌చౌహాన్‌, సాయిఅజయ్‌, సంగీత, రవళి రెండు కార్లలో డొంకరాయి అటవీప్రాంతానికి వెళ్లారు. అక్కడ 235 గంజాయి ప్యాకెట్లను కొన్నారు. హైదరాబాద్‌ మీదుగా ముంబయి వెళ్లేందుకు బయల్దేరారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ శివారు పసుమాముల వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపానికి చేరుకున్నారు. గంజాయిని వేరే కార్లలోకి ఎక్కించేందుకు సిద్ధం కాగా, అప్పటికే నిఘా ఉంచిన హయత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లుతో కూడిన పోలీసు బృందం వారిని పట్టుకుంది. మాదకద్రవ్యాల రవాణాలో 13 మంది నిందితులున్నట్లు గుర్తించారు. వారిలో ఎన్‌.రాహుల్‌(24), సీహెచ్‌.శ్రీకాంత్‌(21), షేక్‌ నవాబుద్దీన్‌(35), వినాయక్‌(32), బి.కిషన్‌(26), బి.నాగ(27), జి.సాయిఅజయ్‌(21), సాయినాథ్‌చౌహాన్‌(21), జె.రవళి(20), డి.సంగీత(20)లను అరెస్ట్‌ చేశారు. కీలక నిందితులు ఆకాశ్‌కుమార్‌(సంగారెడ్డి జిల్లా), తూ.గో.జిల్లాకు చెందిన రాజు, సన్యాసిరావు పరారీలో ఉన్నారు. ముఠా పట్టివేతలో చురుకుగా వ్యవహరించిన పోలీసు బృందానికి అదనపు సీపీ సుధీర్‌బాబు రివార్డులు అందజేశారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని