Updated : 25 May 2022 08:44 IST

గొడవే జరగలేదంటున్న వాచ్‌మన్‌ శ్రీను

సీసీ టీవీ ఫుటేజ్‌ దృశ్యాలు వెలుగులోకి..
డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కొత్త ట్విస్టు

ఈనాడు, కాకినాడ: వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు మీడియాకు వెల్లడించిన అంశాలకు.. క్షేత్ర స్థాయి వాదనకు పొంతన లేదు. కాకినాడ శ్రీరామ్‌నగర్‌లో ఎమ్మెల్సీ అనంతబాబు నివాసం ఉంటున్న శంకర్‌ టవర్స్‌ వద్ద ఎమ్మెల్సీకి, మాజీ డ్రైవరుకు వాగ్వాదం జరిగిందని.. ఈ క్రమంలోనే తలకు రెండుసార్లు తీవ్ర గాయాలై సుబ్రహ్మణ్యం మరణించాడన్నది పోలీసుల వాదన. అసలు శంకర్‌ టవర్స్‌ వద్ద గొడవే జరగలేదని అపార్టుమెంటు వాచ్‌మన్‌, సుబ్రహ్మణ్యం బాబాయ్‌ శ్రీను చెబుతున్నారు. ఈనెల 19న రాత్రి 10.30 సమయంలో అపార్టుమెంటు వద్ద గొడవ జరిగిందన్న పోలీసుల వాదనలో నిజం లేదంటున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు సాయంత్రం 4 గంటలకు శంకర్‌ టవర్స్‌ నుంచి బయటకు వెళ్లారని.. అర్ధరాత్రి 12 గంటలకు హడావుడిగా భార్యతో నివాసానికి వచ్చారని.. అక్కడికి పది నిమిషాలకే దుస్తులు మార్చుకుని మళ్లీ వెళ్లిపోయారని అంటున్నారు. గొడవలో కింద పడిపోవడంవల్లే సుబ్రహ్మణ్యం చనిపోయాడని పోలీసులు చెబుతున్నా.. సీసీటీవీ ఫుటేజ్‌లో ఆ దృశ్యాలు కనిపించలేదు. ఎమ్మెల్సీ అనంతబాబు భార్యతో తిరిగి వచ్చి.. మళ్లీ వెళ్లిపోయినట్లు వాటిలో ఉంది. శంకర్‌ టవర్స్‌ మూడో ఫ్లోర్‌లో ఫ్లాట్‌ నం.401లో అనంతబాబు ఉంటున్నారు.


ఇక్కడ ఏ గొడవా జరగలేదు

- వీధి శ్రీను, వాచ్‌మన్‌, శంకర్‌టవర్స్‌

‘శంకర్‌ టవర్స్‌లో రెండు నెలలుగా వాచ్‌మన్‌గా పని చేస్తున్నా. 19న రాత్రి ఏ గొడవా జరగలేదు. అనంతబాబు సాయంత్రం 4 గంటలకు బయటకు వెళ్లారు. మళ్లీ రాత్రి ఒంటిగంటకు మేడమ్‌తో కలిసి వచ్చి, మళ్లీ పది నిమిషాల్లో బయటకు వెళ్లారు. రాత్రి 11.30 వరకు నేను మెలకువగా ఉన్నాను. ఇక్కడ ఏ గొడవా జరగలేదు. సీసీ టీవీ పనిచేస్తోంది. పోలీసులు ఫుటేజ్‌ తీసుకెళ్లారు. 19న రాత్రి... మా అన్నయ్య ఫోన్‌చేసి, పెద్దోడు (సుబ్రహ్మణ్యం) అక్కడికి వచ్చాడా అని అడిగారు. కారులో తీసుకెళ్లి.. ఫ్రెండ్‌ బండి మీద పంపితే అల్లూరి సీతారామరాజు బొమ్మ దగ్గర పడిపోయాడని ఎమ్మెల్సీ అనంతబాబు చెప్పారని మా అన్నయ్య ఫోన్‌లో తెలిపారు. 2, 3 గంటల వరకు కార్లు తిరుగుతాయి. వాళ్లు కొట్టుకుంటే ఎవరైనా ఆపుతారు కదా.. అంత పెద్ద వ్యక్తి మీద అంత గబుక్కున తిరగబడిపోతారా..? పోలీసులు ఏమీ విచారణ చేయలేదు. నిన్న కొలతలు తీసుకుని వెళ్లిపోయారు. ఎందుకు తీశారో తెలియలేదు. మేడమ్‌ ఎప్పుడు వెళ్లారో తెలీదు. ఇక్కడ గొడవన్నదే జరగలేదు. మమ్మల్ని ఎవ్వరూ అడగలేదు. గొడవ జరిగితే అడుగుతారు కదా?’


ఖైదీ నంబరు 9204

రాజమహేంద్రవరం నేరవార్తలు, న్యూస్‌టుడే: ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌కు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీ నంబరు 9204ను కేటాయించారు. ఆయనకు సోమవారం కాకినాడ స్పెషల్‌ మొబైల్‌ జేఎఫ్‌సీఎం కోర్టు జడ్జి 14 రోజులు రిమాండు విధించిన విషయం తెలిసిందే. ముగ్గురు ఖైదీలు ఉండే ఓ గదిలో ఆయనను ఉంచినట్లు కారాగారం సూపరింటెండెంట్‌ ఎస్‌.రాజారావు తెలిపారు.


 

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని