ఎంబీబీఎస్‌ సీట్ల ముఠాలో సూత్రధారి అరెస్టు

‘నీట్‌ పరీక్ష’ రాసినా ఎంబీబీఎస్‌ సీటు రాలేదా? అయినా కోరుకొన్న కళాశాలలో సీట్లు ఇప్పిస్తామంటూ.. అమాయకులను బోల్తా కొట్టించి డబ్బులు దోచుకొంటున్న ముఠాలో ప్రధాన నిందితుడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. బుధవారం సాయంత్రం సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌, సీసీఎస్‌ ఏసీపీలు పూర్ణచందర్‌, హరీశ్‌కౌశిక్‌, అదనపు డీసీపీ స్నేహామిశ్రాలతో కలిసి సీసీఎస్‌-డీడీ జాయింట్‌ కమిషనర్‌ గజరావు భూపాల్‌ కేసు

Published : 26 May 2022 05:05 IST

బిహార్‌లో హైదరాబాద్‌ పోలీసుల ఆపరేషన్‌
పరారీలో మిగతా ఆరుగురు నిందితులు

నారాయణగూడ, న్యూస్‌టుడే: ‘నీట్‌ పరీక్ష’ రాసినా ఎంబీబీఎస్‌ సీటు రాలేదా? అయినా కోరుకొన్న కళాశాలలో సీట్లు ఇప్పిస్తామంటూ.. అమాయకులను బోల్తా కొట్టించి డబ్బులు దోచుకొంటున్న ముఠాలో ప్రధాన నిందితుడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. బుధవారం సాయంత్రం సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌, సీసీఎస్‌ ఏసీపీలు పూర్ణచందర్‌, హరీశ్‌కౌశిక్‌, అదనపు డీసీపీ స్నేహామిశ్రాలతో కలిసి సీసీఎస్‌-డీడీ జాయింట్‌ కమిషనర్‌ గజరావు భూపాల్‌ కేసు వివరాలను వెల్లడించారు.

నగరానికి చెందిన ఓ విద్యార్థిని నీట్‌ పరీక్ష రాసి కౌన్సెలింగ్‌ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు ఎస్‌ఎంఎస్‌ పంపించాడు. బెంగళూరులోని కిమ్స్‌ కళాశాలలో సీటు ఇప్పిస్తామని నమ్మించాడు. దానికి మొదట రూ.10.16 లక్షలు చెల్లించాలన్నాడు. బాధితురాలు ఆ డబ్బును ఆన్‌లైన్‌ ద్వారా అతనికి బదిలీ చేశారు. ఆ తర్వాత అవతలి వ్యక్తి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయింది. చివరకు ఆమె హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. బాధితురాలి డబ్బు బిహార్‌లోని అశోక్‌ షా ఖాతాకు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు.  దీని ఆధారంగా నిందితుడిని పట్టుకొని  హైదరాబాద్‌కు తరలించారు. ముఠాలోని మిగిలిన ఆరుగురు పరారీలో ఉన్నారని తెలిపారు.  

నేపాల్‌లోని ‘సున్‌సారి’ జిల్లా కేంద్రానికి చెందిన అశోక్‌ షా(30) పదో తరగతి వరకు చదువుకొన్నాడు. బిహార్‌లోని సుపోల్‌ జిల్లా బీర్‌పూర్‌కు చెందిన యువతిని అతను పెళ్లి చేసుకొని అక్కడే నివాసముంటున్నాడు. ఇటీవల కోల్‌కతాకు వెళ్లినపుడు అక్కడో వ్యక్తి పరిచయమయ్యాడు. అతని ద్వారా మరి కొందరు.. ఇలా మొత్తం ఏడుగురు ఒక ముఠాగా ఏర్పడ్డారు. తక్కువ సమయంలో లక్షాధికారులు కావాలనే ఉద్దేశంతో సైబర్‌ మోసాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. ఎంబీబీఎస్‌ సీట్ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని నీట్‌ అర్హత పరీక్ష రాసినవారి వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా సేకరించారు. ఒకొక్కరికి వల విసరడం మొదలుపెట్టారు. కోల్‌కతా, బెంగళూరు, పుణెల్లో ‘కెరియర్‌365’ పేరిట కార్యాలయాలు తెరిచారు. హైదరాబాద్‌లో ఇలాంటి రెండు కేసులు, రాచకొండలో ఒక కేసు నమోదైందని జాయింట్‌ కమిషనరు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని