నరహంతకుడికి జీవిత ఖైదు

ఓ నరహంతకుడికి గద్వాల కోర్టు మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి జీవిత ఖైదు విధించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. మొత్తం 17 మంది మహిళలను హత్య చేసిన చరిత్ర ఆ నిందితుడికి ఉంది. కల్లు, మద్యం తాగే మహిళలే లక్ష్యంగా పెట్టుకునేవాడు.

Updated : 27 May 2022 09:58 IST

17 మంది మహిళల హత్యలతో సంబంధం
దేవరకద్ర ఘటనలో గద్వాల న్యాయస్థానం తీర్పు

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌: ఓ నరహంతకుడికి గద్వాల కోర్టు మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి జీవిత ఖైదు విధించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. మొత్తం 17 మంది మహిళలను హత్య చేసిన చరిత్ర ఆ నిందితుడికి ఉంది. కల్లు, మద్యం తాగే మహిళలే లక్ష్యంగా పెట్టుకునేవాడు. వారి ఒంటిపై బంగారం, వెండి నగలు కనపడితే చాలు.. మాటల్లో పెట్టి.. నమ్మించి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి కిరాతకంగా మట్టుబెట్టేవాడు. ఒంటిపై ఉన్న ఆభరణాలను తీసుకుని పారిపోయేవాడు. సొంత తమ్ముడిని చంపిన కేసులోనూ నిందితుడు. 2019 డిసెంబరు 17న మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామ శివారులో నవాబుపేట మండలం కూచూరు గ్రామానికి చెందిన అలివేలమ్మ(53) మృతదేహాన్ని గుర్తించారు. క్లూస్‌ టీం ఇచ్చిన సమాచారంతో ఆమె హత్య కేసులో పాత నేరస్థుల పాత్ర ఉందనే నిర్ధారణకు వచ్చిన పోలీసులు పలువుర్ని విచారించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం గుండేడుకు చెందిన ఎరుకలి శ్రీను(47)ను అనుమానించి విచారించగా బండారం బయట పడింది. అనంతరం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గద్వాల కోర్టులో విచారణలో భాగంగా నేరం రుజువు కావడంతో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ గద్వాల మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి శివకుమార్‌ గురువారం తీర్పు ఇచ్చారు. దీంతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించారు.

జీవితమంతా నేర చరిత్రే...

2007లో సొంత తమ్ముడిని హత్య చేసి శ్రీను జైలుకు వెళ్లాడు. జైలు నుంచి బయటకొచ్చాకా రంగారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో కల్లు కాంపౌండ్‌లకు తాగడానికి వచ్చిన మహిళలనే లక్ష్యంగా చేసుకుని హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తర్వాత పలుసార్లు జైలుకు వెళ్లి విడుదలవుతూ వస్తున్నాడు. చివరిసారిగా 2018 ఆగస్టులో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తరవాత అధికారులు అతనిలో మార్పు వస్తుందని జిల్లా జైలులోని పెట్రోలు బంక్‌లో ఉపాధి చూపించారు. సరిగ్గా విధులకు హాజరవకపోవడంతో విధుల నుంచి తొలగించారు. జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తే మళ్లీ విధుల్లో చేర్చుకున్నారు. తర్వాతా విధులకు సరిగా హాజరు కాలేదు. ఆ సమయంలోనే జిల్లాలోని మిడ్జిల్‌, భూత్పూర్‌, దేవరకద్ర, కొత్తకోట పోలీసు స్టేషన్ల పరిధిలో నాలుగు హత్యలు చేశాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో టీఎస్‌ఎండీసీ ఇసుక యార్డులో ఒక మహిళ ఎముకల గూడు లభించింది. ఈ హత్యను ఎరుకలి శ్రీను చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.  ఇదే సమయంలో దేవరకద్ర హత్య బయటపడింది. అప్పటి ఎస్పీ రెమా రాజేశ్వరి ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి జీవితఖైదు పడిందని దేవరకద్ర ఎస్‌ఐ భగవంతరెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని