Road Accident: కళ్లెదుటే.. కాలిపోయిన ఆత్మీయులు

విహార యాత్ర ఆనందాలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి. ఆ బంధుగణ పర్యటన విషాదాంతమైంది. కళ్లెదుటే ఆత్మీయులు సజీవంగా

Updated : 04 Jun 2022 07:05 IST

ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురి సజీవ దహనం

విషాదాంతమైన గోవా విహార యాత్ర

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

మృతులంతా హైదరాబాద్‌ వాసులే

ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి

రూ. 3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, కలబురగి, పేట్‌బషీరాబాద్‌, అల్వాల్‌ : విహార యాత్ర ఆనందాలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి. ఆ బంధుగణ పర్యటన విషాదాంతమైంది. కళ్లెదుటే ఆత్మీయులు సజీవంగా కాలిపోతుంటే.. మిగిలిన వారి గుండెలు తల్లడిల్లాయి. కర్ణాటక రాష్ట్రం కలబురగి జిల్లా కమలాపుర పట్టణ శివార్లలో శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు బంధువులు సజీవ దహనమయ్యారు. మిగిలినవారు బస్సులో నుంచి దూకి ప్రాణాల్ని కాపాడుకున్నారు. ఈ ఘటన పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపి పరిహారం ప్రకటించారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్‌లోని అల్వాల్‌కు సమీపంలోని రిసాలబజార్‌లో మాజీ సైన్యాధికారి ముకుందరావు, అతడి సోదరుడు భిక్షపతి, సోదరి అనిత ఉంటున్నారు. కొన్నేళ్ల నుంచి ఈ మూడు కుటుంబాలు ఆధ్యాత్మిక, విహారయాత్రలకు వెళ్తున్నాయి. ఏర్పాట్లను ముకుందరావు కుమారుడు హిందూస్థాన్‌ యూనిలివర్‌ కంపెనీలో సౌందర్య ఉత్పత్తుల విభాగం తెలంగాణ మేనేజర్‌గా పని చేస్తున్న అర్జున్‌కుమార్‌ చూస్తుంటారు. గతేడాది తిరుపతికి వెళ్లిన వీరు ఈసారి గోవాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో అర్జున్‌కుమార్‌ మే 19న కొంపల్లిలోని ఆరెంజ్‌ ట్రావెల్స్‌కు ఫోన్‌ చేసి 28న గోవాకు వెళ్లేందుకు 28 టికెట్లు బుక్‌ చేశారు. జూన్‌ 2న తిరుగు ప్రయాణ టికెట్లు తీసుకున్నారు. అనారోగ్యం కారణంగా అర్జున్‌ తల్లి చివరి నిమిషంలో ఆగిపోయారు. మరోవ్యక్తి విమానంలో వస్తానని చెప్పడంతో మే 28న 26 మంది కొంపల్లి నుంచి బయలుదేరారు(బస్సు నంబరు ఏఆర్‌02 4197). యాత్ర అనంతరం తిరుగు ప్రయాణంలో జూన్‌ 2న గోవాలో ఏఆర్‌025462 బస్సు ఎక్కారు. వీరితో పాటు వైజాగ్‌కు చెందిన ఇద్దరు యువకులు, మెదక్‌, సిద్దిపేట జిల్లాలకు చెందిన నలుగురు యువతీయువకులు కూడా ఈ బస్సులో బయలుదేరారు. ముందు నిర్ణయించిన ప్రకారం వీరి బస్సు శుక్రవారం ఏడెనిమిది గంటలకు హైదరాబాద్‌ చేరుకోవాలి. కమలాపుర పట్టణ శివార్లలోకి వచ్చే సరికి ఉదయం ఆరు గంటలైంది. బస్సులోని అనేక మంది గాఢ నిద్రలో ఉన్నారు. మరికొందరు లగేజీ సర్దుకోవడంలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో.. ఒక్కసారిగా భీకర శబ్దం. ఏమి జరుగుతోందో తెలుసుకునేలోపే పెద్ద కుదుపు.. ఎదురుగా వస్తున్న సరకు రవాణా వాహనాన్ని ఢీకొని బస్సు రోడ్డు పక్కకు పడిపోయి మంటలు వ్యాపించాయి. ఆ షాక్‌ నుంచి తేరుకునేలోపే భారీగా మంటలు చుట్టుముట్టాయి. స్లీపర్‌ బస్సు కావడంతో పైన పడుకున్నవారంతా పడిపోయారు. కొందరు బస్సు అద్దాల్ని పగులకొట్టుకుని దూకి పరుగులు తీశారు. తమ ఆత్మీయులు బస్సులోనే చిక్కుకున్నారని కొందరు సమీపంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా మంటల వేడి వారిని దరిచేరనీయలేదు. బస్సులో నుంచి కాపాడండి కాపాడండి అని కేకలు వినిపించడంతో అక్కడికి పరుగుపరుగున చేరుకున్నామని ప్రత్యక్ష సాక్షి మంజునాథ్‌ తెలిపారు. తాను, తన స్నేహితులు శ్రమించి కొందరిని వెలుపలికి తీశామన్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారని, 12 మందికి గాయాలయ్యాయని కలబురగి జిల్లా పోలీసు అధికారి ఇశా పంత్‌ వెల్లడించారు.

ఏడుగురూ దగ్గరి బంధువులే
ఈ  ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ముకుందరావు కుమారుడు అర్జున్‌కుమార్‌ (37), కోడలు సరళాదేవి (32), మనవడు దివాన్ష్‌ (4), ఆయన సోదరి అనిత (46) ఆమె కుమార్తె రవళి (30), అల్లుడు శివకుమార్‌ (35), మనవడు దీక్షిత్‌ (9)చనిపోయారు. అనిత మరో మనవడు చిన్నారి అద్విత్‌(3) ఈ ప్రమాదం నుంచి బయపడ్డాడు. తన కొడుకు, కోడలు, మనవడు కళ్లెదుటే సజీవ దహనమవడంతో ముకుందరావు సంఘటన స్థలంలోనే కుప్పకూలిపోయారు.

కొడుకు చనిపోయాడని తల్లికి చెప్పలేదు
ప్రమాదంలో అర్జున్‌ మరణించాడన్న విషయాన్ని అతడి తల్లి మీనాకుమారికి చెప్పలేదు. గోవాకు తాను రాలేనంటే ‘నిన్ను ఇక్కడే వదిలి వెళ్లాలంటే ఎలాగో ఉంది’ అని అర్జున్‌ ఆమెతో అన్న విషయాన్ని గుర్తుచేసుకుంటూ బంధువులు రోదిస్తున్నారు. నగరంలోని అల్వాల్‌, కొంపల్లి, మేడ్చల్‌, పాతబస్తీలోని మృతుల బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో విషాదం నెలకొంది.

త్రుటిలో తప్పించుకున్న వైజాగ్‌ యువకులు
పర్యాటక ప్రాంతాలను చుట్టి వచ్చేందుకు వైజాగ్‌కు చెందిన అయిదుగురు యువకులు మంగళవారం గోవాకు చేరుకున్నారు. వీరిలో ముగ్గురు గురువారం ఉదయం విమానంలో హైదరాబాద్‌ రాగా.. విమానం అంటే భయమని ఇద్దరు యువకులు ప్రదీప్‌, గగన్‌లు ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సెక్కారు. శుక్రవారం ప్రమాదం జరిగిన సమయంలో వీరు స్లీపర్‌బెర్త్‌లో ఉన్నారు.  బస్సు అద్దం బద్దలు కొట్టి బయటకు దూకారు. అనంతరం స్నేహితుడికి విషయాన్ని వివరించి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇదే బస్సులో వెనక సీట్లో ఉన్న మెదక్‌, సిద్దిపేట జిల్లాలకు చెందిన నలుగురు యువతీ, యువకులు కూడా అద్దాలను ధ్వంసం చేసి బయటకు దూకారు. వేరే బస్సులో హైదరాబాద్‌ చేరుకొని అక్కడి నుంచి ఇళ్లకు వెళ్లారు.

మృతుల కుటుంబాలకు ప్రధాని సానుభూతి
దిల్లీ: రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఒక ప్రకటనలో ఆకాంక్షించారు.

క్షతగాత్రులకు వైద్యసాయం: సీఎం
రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఒక్కో మృతుని కుటుంబానికి రూ.3 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున అందజేయాలంటూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. క్షతగాత్రులకు వైద్యసాయం అందించడం వంటి చర్యలను చేపట్టాలని మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను ఆదేశించారు. ముకుందరావు, అనిత, భిక్షపతి ఇళ్లకు వెళ్లి మంత్రి తలసాని వారిని ఓదార్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని