Crime News: మాటలు కలిపి కాటేశారు!

జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో రోజుకో మలుపు, పూటకో కొత్తకోణం బయటపడుతున్నాయి. పబ్‌లో బాధితురాలిపై కన్నేసిన

Updated : 06 Jun 2022 10:19 IST

సామూహిక అత్యాచారం కేసులో ఆధారాల సేకరణ

పక్కా ప్రణాళికతోనే తప్పించుకునే ప్రయత్నం

గుల్బర్గాలో మరో బాలుడి పట్టివేత

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌: జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో రోజుకో మలుపు, పూటకో కొత్తకోణం బయటపడుతున్నాయి. పబ్‌లో బాధితురాలిపై కన్నేసిన యువకులు పక్కా ప్రణాళికతోనే దారుణానికి ఒడిగట్టినట్టు దర్యాప్తులో తాజాగా వెలుగుచూసింది. వారు అమ్నీషియా పబ్‌లో ఆమెతో మాటలు కలిపారు. బేకరీ వద్దకు తీసుకెళ్లారు. అక్కడే మరో కారులోకి ఎక్కించుకొని అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో నిందితుడైన మరో బాలుడిని తాజాగా కర్ణాటకలోని గుల్బర్గాలో పోలీసులు అరెస్టు చేశారు. బల్దియాలోని ఒక కార్పొరేటర్‌కు నోటీసులిచ్చినట్లు సమాచారం. పబ్‌ సిబ్బంది నుంచి వాంగ్మూలాలు సేకరించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న బెంజి, ఇన్నోవా కార్లలో ఆదివారం ఫోరెన్సిక్‌ బృందాలు ఆధారాలు సేకరించాయి. ఇన్నోవాలో వేలిముద్రలు, బాలిక చెవికమ్మలు, తలవెంట్రుకలు, చెప్పులు తదితరాలను స్వాధీనం చేసుకున్నాయి. వీర్య నమూనాలూ లభించాయి. బెంజి కారులో చెప్పుల జతతోపాటు రెండు షటిల్‌ కాక్‌లు, టేపు, శానిటైజర్‌, మాస్కులు, ఛార్జింగ్‌ వైర్లను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అధికారిగా బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌ను నియమించారు. కేసుకు సంబంధించిన వీడియోలు బహిర్గతం చేసిన భాజపా శాసనసభ్యుడు రఘునందన్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్టు సమాచారం.

ఆ రోజు ఏం జరిగింది?
ఒక ఇంటర్నేషనల్‌ పాఠశాల పేరుతో మద్యం రహిత వేడుకకు అనుమతి తీసుకున్న ప్లస్‌ వన్‌, ప్లస్‌ టూ విద్యార్థులు, వారి స్నేహితులు పబ్‌కు వచ్చారు. 152 మందికి అనుమతి ఉండగా 182 మంది హాజరైనట్లు సమాచారం. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5.30 వరకు వారు అక్కడే ఉన్నారు. బల్దియాలోని ఓ కార్పొరేటర్‌ కుమారుడు (16) బాధిత బాలికతో మాట కలిపాడు. గతంలో ఒకసారి కలిశామంటూ కథలు చెప్పి నమ్మించాడు. తన స్నేహితులను పరిచయం చేశాడు. వేడుక ముగిశాక బాలికతో కలిసి వారంతా బెంజి, ఇన్నోవా కార్లలో బయలుదేరారు. ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు ఉమేర్‌ఖాన్‌ బెంజి కారు నడుపుతుండగా ఎమ్మెల్యే కుమారుడు, కార్పొరేటర్‌ కుమారుడు, ఇతర స్నేహితులు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. వారు ఆమెకు ముద్దులు పెట్టడం, దగ్గరికి తీసుకొనే దృశ్యాలు సామాజిక మాధ్యమాల ద్వారా బయటికొచ్చాయి. ఆమెను బంజారాహిల్స్‌ రోడ్డు నం.14లోని కాన్సు బేకరీకి తీసుకెళ్లి ఇన్నోవాలోకి ఎక్కించుకున్నాక నిందితులు సుమారు 50 నిమిషాల పాటు బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ మార్గాల్లో చక్కర్లు కొడుతూ అఘాయిత్యానికి పాల్పడ్డారు. తర్వాత బాలికను పబ్‌ వద్ద వదిలేసిన నిందితులు అదే బేకరీ వద్ద ఫొటోలు దిగారు. పార్టీ ముగిసిందంటూ తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో పోస్ట్‌ చేశారు. కార్పొరేటర్‌ కుమారుడు, ఎమ్మెల్యే కుమారుడు, ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ తనయుడు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పబ్‌ నుంచి బేకరీకి వెళ్లే సమయంలో బెంజి కారును నడిపింది ఉమేర్‌ఖాన్‌గా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కార్పొరేటర్‌ కుమారుడు, ఎమ్మెల్యే తనయుడు, ఉమేర్‌ఖాన్‌ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో ఆధారాలను పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాదుద్దీన్‌ మాలిక్‌ (18)తో పాటు మరో ఇద్దరు బాలురను అరెస్టు చేసిన పోలీసులు శనివారం రాత్రి గుల్బర్గా ప్రాంతంలో మరో బాలుడిని అరెస్టు చేశారు. కీలక నిందితుడు ఉమేర్‌ఖాన్‌ (18)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వదంతులు వస్తున్నా, అతడు పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు. అజ్ఞాతంలో ఉన్న ఎమ్మెల్యే కుమారుడి కోసం గాలిస్తున్నారు. సీసీ ఫుటేజీల ఆధారంగా.. ఘటన జరిగిన మరుసటి రోజు ఎమ్మెల్యే కుమారుడి స్నేహితుడొకరిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తాను ఇన్నోవా వాహనంలో కాన్సు బేకరీ వద్దకు మాత్రమే వెళ్లానని, అక్కడే నాలుగైదు గంటలున్నట్లు అతడు చెప్పాడు. దాన్ని సీసీ ఫుటేజ్‌ ద్వారా పోలీసులు నిర్ధారించుకున్నారు. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీ పిటిషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఒక ప్రజాప్రతినిధి సహకారం!
అత్యాచార ఘటన వెలుగు చూడగానే నిందితులు అప్రమత్తమయ్యారు. ఓ ప్రజాప్రతినిధి సలహాతో తప్పించుకునే మార్గాలు వెతికారు. బల్దియాకు చెందిన ఒక కార్పొరేటర్‌ తన కారులో నిందితులను మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. ఇన్నోవాను కూడా అక్కడికి చేర్చారు. ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం రాత్రి అక్కడే ఇన్నోవాను స్వాధీనం చేసుకున్నారు. దానిపై ఉండే ‘ప్రభుత్వ వాహనం’ అనే స్టిక్కర్‌ను అప్పటికే తొలగించినట్లు గుర్తించారు.ఆ వాహనాన్ని కొన్నప్పటినుంచి (2019) తాత్కాలిక (టీఆర్‌) నంబరుతో ఎలా తిప్పుతున్నారనేది ప్రశ్నార్థకం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని