Crime News: ‘ప్రభుత్వ వాహనం’లోనే సామూహిక అత్యాచారం

‘హైదరాబాద్‌లో పదకొండు రోజుల కిందట బాలికపై సామూహిక అత్యాచారం చేసింది ఆరుగురు నిందితులని గుర్తించాం... ఇందులో సాదుద్దీన్‌ (18) ప్రధాన నిందితుడు. మిగిలిన

Updated : 08 Jun 2022 06:46 IST

ఆరుగురు నిందితుల్లో అయిదుగురు మైనర్లే

హోంమంత్రి మనవడిపై ఆధారాలు ఇస్తే కేసు నమోదు చేస్తాం

జూబ్లీహిల్స్‌ కేసు వివరాలు వెల్లడించిన సీపీ ఆనంద్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘హైదరాబాద్‌లో పదకొండు రోజుల కిందట బాలికపై సామూహిక అత్యాచారం చేసింది ఆరుగురు నిందితులని గుర్తించాం... ఇందులో సాదుద్దీన్‌ (18) ప్రధాన నిందితుడు. మిగిలిన అయిదుగురూ మైనర్లు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ బాలుర వివరాలు వెల్లడించరాదు. మే 28న ఈ సంఘటన జరిగింది. మే 31న బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాం. బాధితురాలి వాంగ్మూలం మేరకు సామూహిక అత్యాచారంగా పరిగణించి వేగంగా దర్యాప్తు చేశాం. ‘ప్రభుత్వ వాహనం’ స్టిక్కర్‌ ఉన్న ఇన్నోవా కారులోనే సామూహిక అత్యాచారం జరిగిందని నిర్ధరించుకున్నాం. వెంటనే నిందితులను గుర్తించాం. నిందితుడు సాదుద్దీన్‌ను అరెస్టు చేశాం.. అయిదుగురు మైనర్‌ నిందితులను జువైనల్‌ హోంకు పంపించాం’ అని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ మంగళవారం తెలిపారు. హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సామూహిక అత్యాచారం కేసు వివరాలను ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బాధితురాలిపై అత్యాచారం చేయాలని నిందితులు అమ్నీషియా పబ్‌ వద్దనే నిర్ణయించుకున్నారని సీపీ తెలిపారు. ఆమెను బెదిరించి మెర్సిడెజ్‌ కారులో ఎక్కించుకున్నారని, అక్కడి నుంచి బంజారాహిల్స్‌లోని కాన్సూ బేకరీ వద్ద ఆమెను ఇన్నోవా కారులోకి మార్చారని, జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి ఆలయం సమీపంలోని నిర్జన ప్రదేశంలో సామూహికంగా అత్యాచారం చేశారని వివరించారు. ఈ వ్యవహారంలో హోంమంత్రి మనవడికి సంబంధం లేదని, ఎవరైనా ఆధారాలు తీసుకువస్తే కేసు నమోదు చేస్తామన్నారు. పోలీసులు, దర్యాప్తు అధికారులపై భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు.

పార్టీకి మార్చిలోనే సన్నాహాలు
బెంగళూరులో నివసిస్తున్న ఒక బాలుడు.. కళాశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం మద్యం, పొగాకు రహిత వేడుకలు నిర్వహించేందుకు మార్చి 28న ప్రణాళిక సిద్ధం చేశాడు. హైదరాబాద్‌లోని అమ్నీషియా పబ్‌ను ఎంచుకున్నారు. ఏప్రిల్‌ 19న బెంగళూరు బాలుడు తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ‘యుఫోరియా కమింగ్‌ సూన్‌’ అంటూ పోస్ట్‌ చేశాడు. పార్టీ కోసం డబ్బులు వసూలు చేశాడు. అతడు మే 25న హైదరాబాద్‌ వచ్చి.. రూ.లక్ష అడ్వాన్స్‌ ఇచ్చాడు. బాధిత బాలిక కూడా పార్టీకి తన వంతు సొమ్ము చెల్లించింది. అందరూ కలిసి మే 28న పబ్‌లో పార్టీకి వెళ్లారు.

బాధితురాలు బయటకు చెప్పకపోవడంతో...  
మే 28న ఘటన జరిగితే 31వ తేదీ సాయంత్రం వరకూ ఘటన గురించి బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పలేదు. ఆమె శరీరంపై గాయాలు చూసి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో 31వ తేదీ రాత్రి పోక్సో కేసు నమోదు చేశారు. అప్పటికీ వివరాలు చెప్పకపోవడంతో భరోసా కేంద్రానికి పంపాం. అదనపు డీసీపీ శిరీష 3, 4 గంటలసేపు అనునయంగా మాట్లాడాక.. బాధితురాలు వివరాలు చెప్పింది. తర్వాత ఆమెకు నిలోఫర్‌లో వైద్యపరీక్షలు చేయించారు. ఒక నిందితుడి పేరు మాత్రమే ఆమె చెప్పడంతో జూన్‌ 3 రాత్రి 9 గంటలకు సాదుద్దీన్‌ మాలిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 4వ తేదీ ఇద్దరు మైనర్‌ నిందితులను, 5వ తేదీ మరో మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజీలు పరిశీలించిన తర్వాత.. 6, 7 తేదీల్లో మరో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒక్కరు మాత్రమే మేజర్‌. మరో వ్యక్తి కూడా మేజర్‌ అనుకున్నా... అతడికి 18 సంవత్సరాలకు ఒక నెల తక్కువగా ఉందని పోలీసులు గుర్తించారు.

పబ్బులపై కఠినంగా వ్యవహరిస్తాం
మైనర్లను పబ్‌కు అనుమతించడంపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నాం. అమ్నీషియా పబ్‌పై నివేదికను ఎక్సైజ్‌ శాఖకు పంపాం. పబ్బుల్లో న్యూసెన్స్‌ నేపథ్యంలో లైసెన్సింగ్‌ ప్రారంభిస్తున్నామని చెప్పాం. ట్రాఫిక్‌, శాంతిభద్రతల అనుమతి వచ్చాక.. సిటీ పోలీస్‌ చట్టం కింద పోలీసుల అనుమతి అవసరం. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం.

పబ్‌లోనే అసభ్య ప్రవర్తన
బాధిత బాలిక పబ్‌కు గత నెల 28న మధ్యాహ్నం 1.10 గంటలకు తన స్నేహితుడితో కలిసి వెళ్లింది. సాదుద్దీన్‌, అయిదుగురు బాలురు మధ్యాహ్నం 3.10 గంటలకు పబ్‌కు వచ్చారు. తర్వాత బాధిత బాలికతోపాటు మరో బాలికను వేధించి, అసభ్యంగా ప్రవర్తించారు. బాలికలిద్దరికీ అసౌకర్యంగా అనిపించడంతో సాయంత్రం 5.40 గంటలకు బయటకు వచ్చారు. నిందితులు కూడా వీరి వెన్నంటే రావడంతో బాలిక స్నేహితురాలు కీడు శంకించి క్యాబ్‌లో ఇంటికి వెళ్లిపోయింది. బాధిత బాలికను ఇంటివద్ద దిగబెడతామమంటూ నిందితులు నమ్మించారు. సాయంత్రం 5.43 గంటలకు ఆ బాలిక, నలుగురు మైనర్లు బెంజి కారు ఎక్కారు. వీరి వెనకే ఇన్నోవా కారులో సాదుద్దీన్‌, ఇన్నోవా కారు డ్రైవర్‌, ఇద్దరు మైనర్లు వెళ్లారు.

* బెంజి కారులో వెళ్తున్నప్పుడే మైనర్లు బాలికను లైంగికంగా వేధించారు. ఒకరి తర్వాత ఒకరు ముద్దులు పెట్టారు. బంజారాహిల్స్‌లోని బేకరీకి 5.51 నిముషాలకు వచ్చారు. రెండు వాహనాలనూ అక్కడే పార్క్‌ చేశారు.

* 5.54 గంటలకు బాధితురాలిని బెంజి కారు నుంచి ఇన్నోవాలోకి ఎక్కించారు. సాయంత్రం 6.15 గంటల వరకు అక్కడే ఉన్నారు. తర్వాత ఇన్నోవా అక్కడి నుంచి వెళ్లింది. దాంట్లో సాదుద్దీన్‌ మాలిక్‌, అయిదుగురు మైనర్లు, బాలిక ఉన్నారు. 6.18కి ఈ ఆరుగురిలో ఒక మైనర్‌ వేరే పని మీద తిరిగి వచ్చాడు. సాదుద్దీన్‌ మాలిక్‌, నలుగురు మైనర్లు, బాధితురాలు ఉన్న కారును రోడ్డు నంబరు 44లోని నిర్మానుష్య ప్రాంతంలో ఆపారు. అక్కడ ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు. బాధితురాలి మెడ, ఇతర భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. 7.31కి లభించిన సీసీ పుటేజీలో బాధితురాలిని పబ్‌ దగ్గర వదిలిపెట్టారు. 7.35 గంటలకు తండ్రి వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు.

కారు నడిపినవారు, వారి తల్లిదండ్రులపైనా కేసులు..
మైనర్లు కారు నడపడం నేరమైనందున వారిపై కేసులు నమోదు చేస్తామని సీపీ ఆనంద్‌ తెలిపారు. వారికి ఉద్దేశపూర్వకంగా వాహనాలు ఇస్తే.. తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని వివరించారు. ఆరో నిందితుడు దుబాయ్‌లో ఉన్నట్టు జరిగిన ప్రచారం వాస్తవం కాదని, మైనర్‌ను ఇక్కడే పట్టుకున్నామని వివరించారు. ఆరో నిందితుడు ఎమ్మెల్యే కుమారుడేనా అని ప్రశ్నించగా.. అతడు మైనర్‌ అయినందున సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ వివరాలను బహిరంగపరచలేమని చెప్పారు. కారులో వీడియోలు నిందితులే తీసుకున్నారని, వాటిని వారే లీక్‌ చేశారని, తమ వద్ద వీడియోలు లేవన్నారు. ఇన్నోవా కారు (టీఎస్‌09ఎఫ్‌ఎక్స్‌ 3786)ను స్వాధీనం చేసుకోవడంతో ఎందుకు జాప్యం జరిగిందని ప్రశ్నించగా.. సాంకేతిక కారణాలు, ఇతర అంశాల కారణంగా ఆలస్యమైందన్నారు. అదనపు సీపీ డీఎస్‌ చౌహాన్‌, డీసీపీలు జోయల్‌ డేవిస్‌, శిరీషా రాఘవేంద్రలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగారశిక్ష..
సామూహిక అత్యాచారం కేసులో ఏ1గా సాదుద్దీన్‌ మాలిక్‌, మిగిలిన నలుగురిలో ఒకరు పారిపోగా ప్రత్యేక బృందాల ద్వారా పట్టుకున్నారు. వీరందరినీ జువైనల్‌ హోమ్‌కు పంపించారు. అయిదుగురు నిందితులపై సామూహిక అత్యాచారం (376 డీ) గాయపర్చడం (366 ఏ) పోక్సో, మైనర్‌ బాలిక అపహరణ, వీడియో సర్క్యులేట్‌ చేసిన చట్టాల (ఐటీ చట్టం 67) కింద కేసులు నమోదు చేశారు. వీటి ప్రకారం 20 ఏళ్లకు తక్కువ కాకుండా లేదా జీవిత శిక్ష, ఉరి శిక్ష పడవచ్చు. కేసు విచారణ వేగంగా కొనసాగించాలని ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును పోలీసులు అభ్యర్థించనున్నారు. బాలికపై ఆరో మైనర్‌ అత్యాచారం చేయకున్నా.. కొన్ని వీడియోల్లో అతడున్నందున పోక్సో చట్టం, లైంగిక వేధింపుల కింద కేసు పెట్టాం. అతడికి ఏడేళ్ల వరకూ శిక్ష పడవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని