Nambala Keshava rao: నంబాల కేశవరావును పట్టిస్తే రూ.50 లక్షలు

మావోయిస్టు పార్టీ నేతలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) రివార్డులు ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో 2013లో జరిగిన జీరంఘట్టి దాడిలో ప్రమేయమున్న 21 మందిపై రూ.1.25

Updated : 13 Jun 2022 09:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: మావోయిస్టు పార్టీ నేతలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) రివార్డులు ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో 2013లో జరిగిన జీరంఘట్టి దాడిలో ప్రమేయమున్న 21 మందిపై రూ.1.25 కోట్లకుపైగా రివార్డుల్ని ప్రకటిస్తూ ఎన్‌ఐఏ మూడు రోజుల క్రితం జాబితా విడుదల చేసింది. ఇందులో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బస్వరాజ్‌ని పట్టిస్తే అత్యధికంగా రూ.50 లక్షలు, కమాండర్‌ హిడ్మాని పట్టిస్తే రూ.25 లక్షలు ఇస్తామని ప్రకటించింది. కేంద్ర కమిటీ సభ్యుడు, కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ, నల్గొండ జిల్లా చుండూరుకు చెందిన పాక హన్మంతు అలియాస్‌ ఊకే గణేశ్‌పై రూ.7 లక్షల చొప్పున, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మరో నలుగురిపై రూ.5 లక్షల చొప్పున, ముగ్గురిపై రూ.2.5 లక్షల చొప్పున, ఎనిమిది మందిపై రూ.లక్ష చొప్పున, ఇద్దరిపై రూ.50 వేల చొప్పున ప్రకటించింది. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్‌లో సల్వాజుడుంని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ నేత మహేంద్రకర్మ లక్ష్యంగా 2013 మేలో దాడి జరిగింది. ఇందులో మహేంద్రకర్మ సహా 32 మంది మరణించారు.

బస్వరాజ్‌పై ఇప్పటికే రూ.కోటి రికార్డు..
గతంలోనే బస్తర్‌ పోలీసులు తెలుగు మావోయిస్టు అగ్రనేతలు గణపతి, బస్వరాజ్‌, కటకం సుదర్శన్‌, మల్లోజుల వేణుగోపాల్‌రావుపై రూ.కోటి చొప్పున రివార్డు ప్రకటించారు. తాజాగా బస్వరాజ్‌పై ఎన్‌ఐఏ అదనంగా ఈ రివార్డు ప్రకటించింది. మరోపక్క మావోయిస్టు మిలిటరీ కమిషన్‌ ఏటా నిర్వహించే టాక్టికల్‌ కౌంటర్‌ అఫెన్సివ్‌ క్యాంపెయిన్‌(టీసీఓసీ) ఈసారి ప్రశాంతంగా ముగిసింది. ఏటా ఫిబ్రవరి-జూన్‌ మధ్య మావోయిస్టులు టీసీఓసీ నిర్వహిస్తుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని