Agnipath Protest: రైల్వే పోలీసుల అదుపులో ఆవుల సుబ్బారావు!

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ విధ్వంసం కేసులో నరసరావుపేటకు చెందిన సాయి డిఫెన్స్‌ అకాడమీ

Updated : 22 Jun 2022 06:48 IST

ఈనాడు, హైదరాబాద్‌-న్యూస్‌టుడే, రెజిమెంటల్‌ బజార్‌, ఈనాడు, అమరావతి, నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ విధ్వంసం కేసులో నరసరావుపేటకు చెందిన సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావును రైల్వే పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే వారు అరెస్ట్‌ చేసిన నిందితుల్లో చాలామంది ఈ అకాడమీ విద్యార్థులు ఉన్నారు. వారిలో కొందరు ఈ నేరంతో సుబ్బారావుకు సంబంధం ఉందని చెప్పినట్టు సమాచారం. దీంతో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం రాత్రి నరసరావుపేట వెళ్లారు. మంగళవారం అక్కడి పోలీసులతో సంప్రదించారు. విధ్వంసం వెనుక సుబ్బారావు ప్రమేయం ఉన్నట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయని వివరించారు. వెంటనే సుబ్బారావును హైదరాబాద్‌కు తరలించి రైల్వే పోలీసులకు అప్పగించినట్టు తెలిసింది. విచారణ అనంతరం అరెస్ట్‌ చేసే అవకాశాలున్నాయని సమాచారం.

800 మందికి భోజనాలు!  
సికింద్రాబాద్‌ స్టేషన్‌లో విధ్వంసం సృష్టించేందుకు కార్యాచరణ రూపొందించిన నిందితులు, సాయి అకాడమీలో శిక్షణ పొందిన నిందితులకు ఆవుల సుబ్బారావు భోజన వసతి కల్పించాడని పోలీసులు తెలుసుకున్నారు. విధ్వంసానికి ముందురోజు (ఈ నెల 16) మల్కాజిగిరి, మౌలాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు 800 మంది ఆర్మీ అభ్యర్థులకు సుబ్బారావు వేర్వేరు మార్గాల్లో భోజనాలు పంపించాడని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. అయితే వాట్సప్‌ బృందాల నాయకులు, నిందితులతో సుబ్బారావు మాట్లాడినట్టు పక్కా ఆధారాలు లభించకపోవడం వల్లే రైల్వే పోలీసులు ఇప్పటి వరకు అతడిని నిందితుల జాబితాలో చేర్చలేదని సమాచారం

ఐదు రోజులుగా సుబ్బారావును నరసరావుపేట పట్టణ పోలీసులు విచారించినా కేసు మాత్రం నమోదు చేయలేదు. ఒకవైపు పోలీసు విచారణ జరుగుతుండగానే ఐటీ బృందాలు సోమ, మంగళవారాల్లో సుబ్బారావు అకాడమీ, ఇల్లు, లాడ్జీలో సోదాలు చేశాయి. సుబ్బారావును నరసరావుపేట పోలీసులు విచారిస్తుండగానే అధికార పార్టీ నేతలు కొందరు ఆయనను విడిపించుకు వెళ్లడానికి లాబీయింగ్‌ చేశారని సమాచారం. ఈ విషయం తెలిసి తెలంగాణ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు