తెలంగాణలో ఎన్‌.ఐ.ఎ. సోదాలు

తమ కుమార్తెను కిడ్నాప్‌ చేసి మావోయిస్టులలో కలిపారంటూ ఓ తల్లి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌.ఐ.ఎ.) రంగంలోకి దిగింది. గురువారం తెలంగాణలో ఏకకాలంలో నాలుగు చోట్ల

Updated : 24 Jun 2022 05:52 IST

ముగ్గురి అరెస్టు
నర్సింగ్‌ విద్యార్థిని మావోయిస్టుల్లో చేర్చారంటూ దాఖలైన ఫిర్యాదు నేపథ్యం

ఈనాడు, హైదరాబాద్‌- చేగుంట, న్యూస్‌టుడే: తమ కుమార్తెను కిడ్నాప్‌ చేసి మావోయిస్టులలో కలిపారంటూ ఓ తల్లి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌.ఐ.ఎ.) రంగంలోకి దిగింది. గురువారం తెలంగాణలో ఏకకాలంలో నాలుగు చోట్ల సోదాలు నిర్వహించి ముగ్గురిని అరెస్టు చేసింది. వీరిపై ‘ఉపా’తో పాటు అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. వీరిని విజయవాడలోని ఎన్‌.ఐ.ఎ. న్యాయస్థానంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నర్సింగ్‌ విద్యార్థినిగా ఉన్న తమ కుమార్తె రాధను కొందరు కుట్రపూరితంగా మావోయిస్టు ఉద్యమంలోకి పంపారంటూ హైదరాబాద్‌ కాప్రాకు చెందిన పల్లెపాటి పోచమ్మ గత జనవరిలో విశాఖపట్నం రూరల్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పెదబయలు పోలీసులు కేసు నమోదు చేశారు. నర్సింగ్‌ విద్యను అభ్యసిస్తున్న తమ కుమార్తెను చైతన్య మహిళా సంఘానికి చెందిన దొంగరి దేవేంద్ర, దుబాసీ స్వప్న, చుక్క శిల్ప తదితరులు తరచూ కలుస్తుండేవారని, మావోయిస్టు భావజాలం నూరిపోస్తుండేవారని పోచమ్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2017 డిసెంబరులో దేవేంద్ర ఎవరికో వైద్యం చేయాలంటూ రాధను తీసుకెళ్లారని, అప్పటి నుంచి ఆమె తిరిగి రాలేదని వివరించారు. ఆమె మావోయిస్టులతో కలిసిపోయి విశాఖ జిల్లా పెదబయలు అడవుల్లో పనిచేస్తున్నట్లు 9 నెలల తర్వాత తెలిసిందని ఫిర్యాదులో ప్రస్తావించారు. ప్రాథమిక విచారణ అనంతరం పెదబయలు పోలీసులు కేసును ఎన్‌.ఐ.ఎ.కు బదిలీ చేశారు. ఈనెల 3న ఎన్‌.ఐ.ఎ. హైదరాబాద్‌ విభాగం దీనిపై తాజాగా మరో కేసు నమోదు చేసింది. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్‌ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌, మావోయిస్టు నాయకురాలు అరుణతోపాటు చైతన్య మహిళా సంఘానికి చెందిన దేవేంద్ర, స్వప్న, శిల్పలను ఇందులో నిందితులుగా పేర్కొంది. దర్యాప్తులో భాగంగా ఎన్‌.ఐ.ఎ. అధికారులు గురువారం వీరి ముగ్గురి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్‌కు చెందిన శిల్ప హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆమెతోపాటు ఘట్‌కేసర్‌ మండలం పర్వతపూర్‌కు చెందిన దేవేంద్ర, మెదక్‌ జిల్లా చేగుంట, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన స్వప్న నివాసాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక పత్రాలు, కంప్యూటర్‌ హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకొని, ముగ్గురినీ అరెస్టు చేసినట్లు ఎన్‌.ఐ.ఎ. ఓ ప్రకటనలో పేర్కొంది.

విశాఖలోనూ సోదాలు?

జాతీయ దర్యాప్తు సంస్థ బృందం విశాఖ నగరంలోనూ గురువారం సోదాలు జరిపినట్లు సమాచారం.  22 మందితో కూడిన బృందం విశాఖకు రాగా.. అందులో ముగ్గురు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లినట్లు, మావోయిస్టు సానుభూతిపరుడిగా ఉన్న ఒక ఆచార్యుడి ఇంట్లో సోదాలు జరిపినట్లు తెలిసింది.

వెంటనే విడుదల చేయాలి: పౌరహక్కుల సంఘం

ఐదారేళ్ల క్రితం నాటి ఘటనను సాకుగా తీసుకొని చైతన్య మహిళా సంఘం నేతల ఇళ్లపై ఎన్‌.ఐ.ఎ. దాడులు జరిపి అరెస్టులు చేయడాన్ని పౌరహక్కుల సంఘం తెలంగాణ అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి ఎన్‌.నారాయణరావు ఓ ప్రకటనలో ఖండించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని