Published : 25 Jun 2022 05:07 IST

నిండు ప్రాణాలను బలిగొన్న విద్యుత్తు శాఖ నిర్లక్ష్యం

కరెంటు తీగ మీదపడి అన్నదమ్ముల సజీవదహనం  
ఏలూరు జిల్లా దేవులపల్లిలో ఘోరం

జంగారెడ్డిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: విద్యుత్తు శాఖ నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. కరెంటు తీగ తెగి మీద పడటంతో ఇద్దరు అన్నదమ్ములు సజీవ దహనమయ్యారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో శుక్రవారం ఉదయం ఈ విషాదకర ఘటన జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ఈ గ్రామానికి చెందిన వల్లేపల్లి నాగేంద్ర (21), ఫణీంద్ర (18) అన్నదమ్ములు. తండ్రి దుర్గారావుకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆవుల పాలు పిండడం కోసం ద్విచక్ర వాహనంపై వారిద్దరూ పొలానికి బయల్దేరారు. మార్గమధ్యలో 11 కేవీ విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ తీగ తెగి చెట్టు కొమ్మమీద పడింది. అది కాలిపోవడంతో తీగ వేలాడుతూ వాహనం నడుపుతున్న ఫణీంద్ర మెడకు చుట్టుకుంది. విద్యుత్తు ప్రసారం ఉండటంతో ఒక్కసారిగా మంటలు రేగి వాహనంతో పాటు ఇద్దరూ అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. నాగేంద్ర ఇంజినీరింగ్‌ చదువుతుండగా, ఫణీంద్ర ఇంటర్‌ పూర్తి చేశాడు. కొద్దిరోజుల నుంచి ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి నిప్పురవ్వలు పడుతున్నాయని.. వెంటనే సరిచేయాలని విద్యుత్తు శాఖ సిబ్బందిని కోరినా పట్టించుకోలేదని స్థానిక రైతులు ఆరోపించారు. బాధిత కుటుంబానికి పరిహారం అందించి, ప్రమాదానికి కారకులైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఏలూరు-జంగారెడ్డిగూడెం రహదారిపై మృతదేహాలతో స్థానికులు పెద్దఎత్తున ధర్నాకు దిగారు. నాయకులు, అధికారులు వచ్చి బాధితులకు పరిహారం అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

విచారణ చేస్తున్నాం

‘దేవులపల్లిలో జరిగిన ఘటనపై విచారణ చేస్తున్నాం. ట్రాన్స్‌ఫార్మర్‌ మెయిన్‌ బ్రాకర్‌ (ఎల్‌వీ) ట్రిప్‌ కావడంతో అర్ధరాత్రి 2.20 గంటలకు సరఫరా నిలిచిపోయింది. దీనిని గమనించని సిబ్బంది తిరిగి ఛార్జి చేయడంతో తెగిన తీగకు విద్యుత్తు సరఫరా అయ్యింది. ఇదే ప్రమాదానికి కారణమై ఉంటుందని అంచనా వేస్తున్నాం. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని విద్యుత్తు శాఖ ఈఈ అంబేడ్కర్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts