ఆందోళనా? ఓ 50 మంది వస్తారేమో..!

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసానికి నిఘా వర్గాల వైఫల్యం, రైల్వే పోలీసుల ఉదాసీనతే ప్రధాన కారణమని నిర్ధారణయింది. నిరసన తెలిపేందుకు ఆర్మీ అభ్యర్థులు వస్తున్నట్టు ముందుగానే తెలిసినప్పటికీ ‘ఓ 50 మందే వస్తారులే,.....

Updated : 25 Jun 2022 10:23 IST

ఆర్మీ అభ్యర్థుల నిరసనను తేలిగ్గా తీసుకున్న పోలీసులు
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసంపై రహస్య నివేదిక

ఈనాడు,హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసానికి నిఘా వర్గాల వైఫల్యం, రైల్వే పోలీసుల ఉదాసీనతే ప్రధాన కారణమని నిర్ధారణయింది. నిరసన తెలిపేందుకు ఆర్మీ అభ్యర్థులు వస్తున్నట్టు ముందుగానే తెలిసినప్పటికీ ‘ఓ 50 మందే వస్తారులే, వాళ్లను తేలిగ్గానే నియంత్రించవచ్చులే’ అనే అతి విశ్వాసంతో ఉండటం వల్లనే ఇంత ఘోరం జరిగిందని తేలింది. విధ్వంసాన్ని అంచనా వేయడంలో నిఘా విభాగం తీవ్ర వైఫల్యం చెందిందనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలీస్‌ ఉన్నతాధికారులు పూర్వాపరాలు తెలుసుకునేందుకు రహస్యంగా ఒక బృందాన్ని ఏర్పాటుచేసినట్టు తెలిసింది. ఈ బృందం రైల్వేస్టేషన్‌ పరిసరాలు, లోపల, వెలుపల పరిస్థితులు తెలుసుకుంది. విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూసిన సాక్షులతో మాట్లాడింది. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి.. విశ్లేషించి ఈ మేరకు నిర్ణయానికి వచ్చినట్టు, సంబంధిత అంశాలతో నివేదిక తయారుచేసినట్టు సమాచారం.

ఒక ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు..

అగ్నిపథ్‌ ప్రకటనకు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్లలోనూ నిరసన ప్రదర్శనలు చేసే అవకాశాలున్నాయని రైల్వే పోలీసులు భావించారు. ఈలోపు హైదరాబాద్‌ పోలీసులు కూడా విపక్షాలు, ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చేస్తారనే సమాచారాన్ని సేకరించారు.  16వతేదీ రాత్రి 40-50 మంది ఆర్మీ అభ్యర్థులు స్టేషన్‌ వెలుపల ఆందోళన చేస్తారని రైల్వే పోలీసులకు సమాచారం అందింది. ఇదే విషయాన్ని వారు ఉత్తరమండలం పోలీస్‌ అధికారులకు సమాచారమిచ్చినట్టు, ఒక ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు, ముగ్గురు హోంగార్డులతో బందోబస్తు ఏర్పాటుచేస్తే సరిపోతుందని చెప్పినట్టు తెలిసింది.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఆందోళన నిర్వహించేందుకు ఆర్మీ అభ్యర్థులు వస్తున్నారన్న సమాచారంతో బందోబస్తు పోలీసులు 17న ఉదయం 8గంటల సమయంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. ఆ సమయంలో ఆర్మీ అభ్యర్థులు కన్పించకపోవడంతో పది, పదిన్నర గంటలకు వద్దామనే ఆలోచనతో అక్కణ్నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. ‘ఈ నేపథ్యంలో ఉదయం 9.15 గంటలకు వందల మంది రైల్వే స్టేషన్‌లోకి ఉన్నపళంగా చొచ్చుకురావడంతో గోపాలపురం పోలీసులు, రైల్వే పోలీసులు చేతులెత్తేశారు. విధ్వంసం జరుగుతున్నా అడ్డుకోలేకపోయారు’ అని ఆ బృందం సమాచారం సేకరించిందని తెలిసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని